అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే మంత్రులకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ నిధుల పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ
న్యూఢిల్లీ: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే మంత్రులకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. యాభై ఏళ్లనాటి మంత్రుల ప్రవర్తనా నియమావళిలో ఈ మేరకు చేసిన తాజా సవరణలను కేబినెట్ గురువారం ఆమోదించింది. ఈ సవరణలు కేంద్ర స్థాయిలో వెంటనే అమల్లోకి వస్తాయి. వాటిని రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిందిగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతారు. అధికారులను బుట్టలో పడేసే ఆకర్షణీయ బదిలీలు, పోస్టింగులను ఇచ్చే ట్రెండ్‌కు ఈ సవరణలు చెక్ పెట్టనున్నాయి. అలాగే అధికారుల విధులు, బాధ్యతలకు విరుద్ధమైన ఎలాంటి పనీ చేయాల్సిందిగా ఆదేశించరాదని మంత్రులకు ఇందులో సూచనలున్నాయి. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సంబంధిత రాష్ట్ర మంత్రులకు సంబంధించిన ఈ నియమావళికి చట్టబద్ధత లేనప్పటికీ.. ఇందులోని సూచనలు, సలహాలకు మంత్రులందరూ కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లు హోం శాఖ ప్రవేశపెట్టిన ఈ సవరణల్లో పేర్కొంది.
నిధుల పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ: ప్రభుత్వ పథకాల అమలుకు విడుదల చేసే నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు కేంద్రం కొత్త పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన.. ‘కేంద్ర ప్రణాళిక నిధుల పర్యవేక్షణ వ్యవస్థ’కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. అన్ని ప్రణాళిక పథకాల కోసం విడుదల చేసే నిధులు ఎటు నుంచి ఎటు వెళుతున్నదీ పర్యవేక్షించేలా ఆన్‌లైన్ ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక నెట్‌వర్కులను, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలను ఈ వ్యవస్థకు లింక్ చేస్తారు.
ట్రెజరీ, బ్యాంకుల ద్వారా నిర్వహించే అన్ని పథకాలకు ఏ స్థాయిలో ఎప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నారన్న వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఇందులో ఉంటుంది. దీనికి సంబంధించి రూ.1080 కోట్లతో నాలుగేళ్ల కాలానికి(2017) చేపడుతున్న కేంద్ర ప్రణాళిక పథకాల పర్యవేక్షణ వ్యవస్థ(సీపీఎస్‌ఎంఎస్)కు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్నే ప్రణాళిక అకౌంటింగ్, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(పీఏఅండ్‌పీఎఫ్‌ఎంఎస్)గా కూడా పిలుస్తున్నారు. అలాగే రాష్ట్రీయ కృషి వికాస యోజనను కొనసాగించడం సహా పలు వ్యవసాయ పథకాలను 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో ఉద్యానవన సమగ్ర అభివృద్ధి మిషన్ పథకం కూడా ఉంది.