స్మార్ట్ ఫోన్లలో రెండో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న దేశంలో, రియల్ టైమ్ లో సమాచారం అందించేందుకు కేంద్రప్రభుత్వం వీటినే ప్రసార మాధ్యమాలుగా ఎంచుకోనుంది.
న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్లలో రెండో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న దేశంలో, రియల్ టైమ్ లో సమాచారం అందించేందుకు కేంద్రప్రభుత్వం వీటినే ప్రసార మాధ్యమాలుగా ఎంచుకోనుంది. సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి కేంద్ర సమాచార అధికారులకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించనుంది. తాజా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించిందని, త్వరలోనే అధికారులు ఫోన్లను అందుకోబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆధునిక ఫీచర్లతో, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా యాప్స్ తో ఈ ఫోన్లు ఉండబోతున్నాయి.
మైక్రోబ్లాగింగ్ సైట్ లో అధికారులు తమ అకౌంట్లు తెరుచుకోవాలని, దాని ద్వారా మంత్రులు, అధికారులు చేపట్టిన కార్యకలాపాలను, సాధించిన విజయాలను ట్వీట్ ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. రూ.14,000 ధర కలిగిన స్మార్ట్ ఫోన్లను ఈ స్కీమ్ కింద అధికారులకు అందజేస్తున్నారని సమచారం. అదేవిధంగా ఈ స్కీమ్ కింద అందించే ఫోన్లలో చాలా కంపెనీలు పోటీ పడుతుండగా.. తైవాన్ కు చెందిన లీడింగ్ మల్టీనేషనల్ హార్డ్ వేర్, ఎలక్ట్రిక్ తయారీదారి ఆసుస్ కంపెనీ ఫోన్ జెన్ ఫోన్ ముందంజలో ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అధికారిక పనుల కోసం ల్యాప్ టాప్ తీసుకోని కేంద్రప్రభుత్వ ఆఫీసర్లకు ఈ స్మార్ట్ ఫోన్లను ఇస్తారని, ల్యాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్ అనేది ఆప్షనల్ గా ఉంటుందని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా ఇన్ ఫర్మేషన్ ఆఫీసర్లను తాజా సమాచారంతో అనుసంధానం చేసి, ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలను ప్రజలకు తెలియజేయడానికి ఆఫీసర్లు చురుకుగా పాల్గొనేలా చేయడానికి స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందించనుంది.
అయితే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అమెరికాను అధిగమించి భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించింది. స్మార్ట్ ఫోన్ డివైజ్ లు భారత్ లో సరసమైన ధరలకే లభిస్తున్నాయని 2015 డిసెంబర్ 22న గ్లోబల్ రీసెర్చ్ రీసెర్చ్ సంస్థ ఈమార్కెటర్ నివేదించింది. ఈ గ్లోబల్ ర్యాకింగ్ లో 624.7 మిలియన్ స్మార్ట్ ఫోన్లతో చైనా అగ్రస్థానంలోనే ఉంది. రెండో స్థానంలో భారత్(204.1 మిలియన్), తర్వాతి అమెరికా(198.5 మిలియన్), రష్యా (65.1 మిలియన్), జపాన్(61.2 మిలియన్) లు ఉన్నాయి.