
ఐటీ కంపెనీల ‘గన్’తంత్రమ్!
సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇకపై కంప్యూటర్‌లో బగ్స్, మాల్‌వేర్‌లను నాశనం చేయడమే కాదు..
భద్రత కోసం సాఫ్ట్‌వేర్ సంస్థలకు గన్ లెసైన్స్‌లు
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు
ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఐటీ సంస్థలకు శిక్షణ
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇకపై కంప్యూటర్‌లో బగ్స్, మాల్‌వేర్‌లను నాశనం చేయడమే కాదు.. భౌతికంగా తమపై దాడి చేసే ముష్కరమూకల పని కూడా పట్టనున్నాయి. ఐటీ కంపెనీలను, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల నిలయమైన గచ్చిబౌలి ప్రాంతంలో భద్రతా ప్రమాణాలను పరీక్షించారు. గచ్చిబౌలి పరిసరాల్లో దాదాపు 500 ఐటీ కంపెనీలు రిజిస్టర్ అయినవే ఉన్నాయి. వీటి రక్షణకు ఆయా సెక్యూరిటీ ఏజెన్సీలు తీసుకుంటున్న చర్యలను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సిబ్బంది అధ్యయనం చేశారు. అకస్మాత్తుగా జరిగే దాడులను ఎదుర్కొనేందుకు వాళ్ల వద్ద ఉన్న సెక్యూరిటీ, ప్రొటెక్షన్ తదితరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎవరి వద్దా ఆయుధాలు లేవన్న విషయం తేలింది.
అయితే గచ్చిబౌలి క్యాంపస్‌లోని ఒక కంపెనీకే ఆర్మ్‌డ్ సెక్యూరిటీ గార్డింగ్ ఉందని గుర్తించారు. దీని మాదిరిగానే ఇతర కంపెనీలూ భద్రతా ప్రమాణాలు పాటిస్తే జరగబోయే నష్టాన్ని తగ్గించవచ్చని భావించారు. ఎస్‌సీఎస్‌సీ చైర్మన్‌గా ఉన్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర సిబ్బందితో కలసి కార్యచరణ రూపొం దించారు. పోలీసు కమిషనరేట్ నిబంధనల ఆధారంగా ఐటీ కంపెనీలకు గన్ లెసైన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. రాత్రిపూట పరిసర ప్రాంతాలను పర్యవేక్షించేందుకు నైట్ విజన్‌లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లు సమకూర్చుకోవాలని కంపెనీలకు సూచించారు.
నిబంధనలు ఇలా...
పారా మిలిటరీ ఫోర్స్, మాజీ పోలీసు అధికారి హెడ్‌లుగా ఉన్న ఆయా ఐటీ కంపెనీల సెక్యూరిటీ ఏజెన్సీలకు గన్ లెసైన్స్‌లు త్వరితగతిన జారీ చేస్తున్నారు. ఆ కంపెనీలో ఏం జరిగినా కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గన్ లెసైన్స్ పొందిన కంపెనీ సెక్యూరిటీ సిబ్బందికి కూడా తగిన తర్ఫీదు ఇస్తారు. ‘లెసైన్స్‌డ్ తుపాకీలు ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపైనా వివరాలు సేకరిస్తాం. వారి ప్రొసీజర్‌ను కూడా ఆడిట్ చేస్తాం. లెసైన్సులు తప్పనిసరంటూ ఏ కంపెనీపైనా ఒత్తిడి తేవడం లేదు’ అని ఎస్‌సీఎస్‌సీ అంటోంది.
ఆయుధాలుంటేనే అడ్డుకోగలరు
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉండాలి. ఉగ్రవాద దాడు ల్ని ఎదుర్కొనేందుకు ఆయుధాలున్న సిబ్బంది అవసరం. కానీ ఐటీ కారిడార్‌లోని సంస్థల భద్రత ప్రమాణాలు ఈ స్థాయిలో లేనందున ఆ సంస్థలకు గన్ లెసైన్స్‌లు జారీ చేయాలని నిర్ణయించాం. ఆయా సంస్థల అవసరాలను బట్టి రెండుకు మించి గన్ లెసైన్స్‌లు ఇస్తాం.
- సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
పెద్ద కంపెనీల స్పందన బాగుంది..
సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో విమెన్, సేఫ్టీ సెక్యూరిటీ, ట్రాఫిక్ ఫోరమ్‌లున్నాయి. సేఫ్టీ సెక్యూరిటీ ఫోరమ్ సభ్యులు ఐటీ సంస్థల భద్రతా ప్రమాణాలను అధ్యయనం చేశారు. పోలీసు కమిషనర్ గన్ లెసైన్స్ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పెద్ద కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ ప్రణాళిక పూర్తిగా కార్యరూపం దాల్చనుంది.
- భరణికుమార్, ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి