అనంతపురం క్రైం: ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన ఉదంతం అనంతపురంలో వెలుగు చూసింది. బాధితులు సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌ను ‘స్పందన’లో కలసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాప్తాడుకు చెందిన టీడీపీ నేత కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శశి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గుర్రం వెంకటరామ్, భానుచంద్రతో పాటు మరికొంత మంది ఘరానా కేటుగాళ్లు.. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాల పేరిట బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు వల వేశారు.
ప్రధానంగా కంప్యూటర్ శిక్షణ కేంద్రాల వద్ద పాగా వేసిన వీరు అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 150 మందికి పైగా నిరుద్యోగులను ముగ్గులోకి దింపారు. శాలరీ ప్యాకేజీని బట్టి ధర ఉంటుందంటూ ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేశారు. ఇలా రూ. 5 కోట్లకు పైగా దండుకున్నారు. డబ్బిచ్చిన వారికి ఆరు నెలల శిక్షణ కూడా ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో రూ.10 వేల నుంచి రూ.18 వేల దాకా గౌరవ వేతనం కూడా చెల్లిస్తామని నమ్మబలికారు.
నకిలీ కంపెనీ పెట్టి...
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ‘సార్టీస్ టెక్నాలజీ లిమిటెడ్’ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు. నిజమని నమ్మి డబ్బు కట్టిన వారు అదే ప్రాంతంలో అద్దెకు గదులు తీసుకుని ఆరు నెలల పాటు వారు చెప్పిన పని చేసుకుంటూ వచ్చారు. అయితే.. వారికి కంపెనీ పనులు పూర్తి కాలేదంటూ గౌరవ వేతనం కూడా చెల్లించలేదు. చేసేది లేక చాలా మంది నిరుద్యోగులు ‘ఎలాగూ ఇన్ని నెలలు ఉన్నాం కదా?! మిగిలిన కాలం పూర్తి చేస్తే ఉద్యోగం దొరుకుతుంద’న్న ఆశతో అప్పులు చేసి మరీ కాలం గడిపారు. తీరా నిర్వాహకులు రాత్రికి రాత్రే కంపెనీకి తాళాలు వేసి అనంతపురానికి చేరుకున్నారు. బాధితులు బెంగళూరు నుంచి ఇళ్లకు రాలేక, అయిన వారికి ముఖం చూపించలేక నరకయాతన అనుభవించారు.
నాన్న ఆరోగ్యం బాగోలేదన్నా కనికరించలేదు
పుట్టపర్తికి చెందిన ఓ యువకుడు తండ్రికి తెలియకుండా లక్షలాది రూపాయలు అప్పుగా తెచ్చి వారికి చెల్లించాడు. ప్రస్తుతం తండ్రి ఆరోగ్యం బాగా క్షీణించి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో అతను అనంతపురం వచ్చి వారిని కాళ్లా వేళ్లా పడినా డబ్బివ్వలేదు. పైగా మరోసారి వస్తే నీపైనే ఎదురు కేసు పెట్టి లోపలేయిస్తామని బెదిరించారు.
డబ్బడిగితే బెదిరిస్తున్నారు!
నిరుద్యోగులను వంచించిన వారు అనంతపురంలో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వారిని బాధితులు కలసి తమ డబ్బు తిరిగివ్వాలని కోరితే... బెదిరింపులకు దిగుతున్నారు. ‘మా వెనుక రాప్తాడుకు చెందిన టీడీపీ నేతలు ఉన్నారు. ఖబడ్దార్’ అంటూ దాడులకు సైతం తెగబడుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్‌లోని చిత్రావతి అతిథి గృహం వద్దకు బాధితులను పిలిపించుకుని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ‘అన్నీ మూసుకుని వెళతారా? లేక తన్నులు తింటారా’ అంటూ బెదిరించారు. డబ్బు తిరిగివ్వకపోగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కొంత మంది బాధితులు సోమవారం జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment