
ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్: పోలీసు కమిషనర్ బదిలీ
భారీ వర్షపాతంతో ఎన్నడూ కనీ వినీ ఎరుగనంత ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, ఇది ఏకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా వివాదానికి కారణం అవడంతో ఓ పోలీసు కమిషనర్ మీద బదిలీ వేటు పడింది. హరియాణాలోని గుర్గావ్ పోలీసు కమిషనర్ నవదీప్ విర్క్ను రోహ్తక్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సందీప్ ఖిరావర్ను గుర్గావ్ సీపీగా నియమించారు. గుర్గావ్ వద్ద ఏకంగా 17 గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ తప్పునకు బాధ్యులు మీరంటే మీరంటూ హరియాణా, ఢిల్లీ ముఖ్యమంత్రులు పరస్పరం ఆరోపించుకున్న విషయం తెలిసిందే. ఇక తాము అన్ని గంటల పాటు రోడ్డు మీదే ఇరుక్కుపోయినా.. ఎక్కడా ఒక్క పోలీసు కూడా కనిపించలేదని ప్రజలు ఆరోపించారు. దాంతో విర్క్ మీద వేటు పడింది.
అయితే పోలీసులు మాత్రం పూర్తిస్థాయిలో విధుల్లో పాల్గొన్నారని ఆయన అంటున్నారు. నీళ్లు నిలిచిపోతుంటే పట్టించుకోకపోవడం కార్పొరేషన్ తప్పని చెప్పారు. శుక్రవారం నాడు ఎన్హెచ్8 మీదుగా వెళ్లిన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. వందలాది ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో మొత్తం ట్రాఫిక్ క్లియర్ అవడానికి దాదాపు 17 గంటలకు పైగా సమయం పట్టింది. సాయంత్రం 6 గంటలకు మొదలైన కష్టాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది తమ వాహనాలను అక్కడే వదిలేసి, మోకాలి లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి గుర్గావ్ మధ్య ప్రయాణాలు ఆపుకోవాలని పోలీసులు ప్రజలకు సలహా ఇచ్చారు.