హెచ్1బీ ఎఫెక్ట్: ఇన్ఫీ సంచలన నిర్ణయం
ముంబై: దేశీయ అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనుంది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న హెచ్1 బీ వీసాలపై కఠిన నిర్ణయాల నేపథ్యంతో ఇన్ఫీ ఈ నిర్ణయం తీసుకుంది. టీసీఎస్, విప్రో లాంటి ఇతర దేశీ ఐటీ దిగ్గజాల బాటలోనే పయనిస్తూ అమెరికాలో స్థానికులకు ప్రాముఖ్యత ఇవ్వనున్నట్టు సోమవారం వెల్లడించింది. కృత్రిమ మేధస్సు వంటి రంగాలలో అమెరికా వారిని నియమించాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగంలో సుమారు 10వేలమంది అమెరికా ఐటీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఇన్ఫోసిస్ రడీ అవుతోంది. ఈ మేరకు అక్కడ నాలుగు టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రధానంగా ఇండియానాలో ఆగస్టునెలలో మొదటి సెంటర్ ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అమెరికన్లను నియమించు కునేందుకు చూస్తున్నట్టు ఇన్పీ సీఈవో విశాల్ సిక్కా రాయిటర్స్ ఇంటర్య్వూలోచెప్పారు. 2014 లో ప్రారంభించిన ప్రయత్నంలో భాగంగా సంస్థ 2 వేల మందిని ఇప్పటికే నియమించుకున్నట్టు తెలిపారు. అంతేకాదు అమెరికా వైపు నుంచి ఆలోచించినప్పుడు, మరింతమంది అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, మంచి విషయమే అని సిక్కా చెప్పడం విశేషం.