మాతృదేశం కోసం సర్వం వదులుకున్న త్యాగధనులు భారతీయ జవాన్లు అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు. ఆదివారం హర్యానాలోని రేవారిలో ఏర్పాటు చేసిన మాజీ సైనికుల ర్యాలీలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాజీ సైనికులనుద్దేశించి ప్రసంగిస్తూ.... దేశం కోసం అమరులైన జవాన్లకు ఆయన వందనాలు తెలిపారు. సైనిక స్కూల్లో చదువుకోవాలన్న తన లక్ష్యం నెరవేరలేదన్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికై మొట్టమొదటిసారిగా ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్లో న్యూఢిల్లీ నుంచి నేరుగా హర్యానాలోని రేవారికి మోడీ చేరుకున్నారు. అనంతరం మోడీని ఆర్మీ మాజీ చీఫ్ వి.కే.సింగ్ సభవేదికపైకి తోడ్కుని వెళ్లారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ సభకు హాజరైన ప్రజలు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ర్యాలీకి వందలాది మంది మాజీ సైనికులతోపాటు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.