
హ్యాట్సాప్ బుమ్రా.. అద్భుతాన్ని చేశావు!
నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేశాడు. చివరి రెండు ఓవర్లలో ఐదు పరుగులు ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్‌పై భారత్ అనూహ్యంగా ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో భారత బౌలర్లు ఆశిష్ నెహ్రా, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించారు.
145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 30 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన స్థితిలో దృఢంగా కనిపించింది. కానీ తాను వేసిన చివరి రెండు ఓవర్లలో బుమ్రా అద్భుతమైన ట్రిక్స్‌తో భారత్ వైపు విజయాన్ని తిప్పాడు. 18వ ఓవర్‌లో నాలుగు డాట్ బాల్స్ వేసిన బుమ్రా.. దాదాపు రూట్‌ను ఔట్ చేసినంత పని చేశాడు. ఇక చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి ఎనిమిది పరుగులు కావాల్సిన దశలో ఈ యువ బౌలర్ ఒత్తిడిని తట్టుకుంటూ వేసిన స్లో డెలివరీ బంతులు ఇంగ్లిష్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేశాయి. రెండు వికెట్లు సమర్పించుకొని ఐదుపరుగుల తేడాతో అతిథి జట్టు పరాజయాన్ని మూటగట్టుకుంది.
బుమ్రా చూపిన ఈ అసాధారణ బౌలింగ్ ప్రతిభపై సహ బౌలర్ ఆశీష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఇది చాలా ప్రెషర్ గేమ్. మ్యాచ్‌ను కాపాడుకునేందుకు జస్ప్రీత్‌కు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగుల తేడా ఇవ్వడానికి ప్రయత్నించాను. అతనికి హ్యాట్సాప్ చెప్పాలి. గతంలో కూడా ఇదే తరహాలో ఆడి.. భారత్‌కు విజయాన్ని అందించాడు. ఎలా బౌలింగ్ చేయాలని అతను నన్ను అడిగాడు. నువ్వు యార్కర్లు బాగా వేస్తావు. పుల్‌లెంత్ బంతులు వెయ్యి. కొట్టడానికి కష్టంగా ఉంటుందని చెప్పాను. అది పనిచేసింది. నాలుగు ఓవర్లలో 32 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లండ్ ఉన్నప్పుడు విజయం మనదేనని జస్ప్రీత్‌కు నేను చెప్పాను' అని మ్యాచ్ అనంతరం నెహ్రా చెప్పాడు.