హవిల్దార్ హాంగ్పాన్కు అశోకచక్ర పురస్కారం
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల తూటాలకు వెరవకుండా యుద్ధక్షేత్రంలోకి చొచ్చుకుపోయి నలుగురు ముష్కరులను మట్టుపెట్టి, తానూ అమరుడైన హవిల్దార్ హాంగ్పాన్ దాదాకు సముచిత గౌరవం దక్కింది.. దేశ రక్షణ కోసం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆ వీర సైనికుడికి ప్రతిష్టాత్మక 'అశోకచక్ర' పురస్కారం లభించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వం పురస్కారానికి ఎంపికైనవారి జాబితాను ప్రకటించింది. (నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు)
35 రాష్ట్రీయ రైఫిల్స్లో జవాన్గా పనిచేసిన దాదా.. ఈ ఏడాది మేలో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలు కోల్పోయాడు. తాను మరణించడానికి ముందు నలుగురు ఉగ్రవాదులను కాల్చిచంపాడు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన దాదాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో రాషష్ట్రపతి ప్రణబ్.. దాదా కుటుంబసభ్యులకు పురస్కారాన్ని అందజేస్తారు. కాగా, సైనిక రంగంలో విశిష్టసేవలు అందించిన మరో 11 మందికి శౌర్యచక్ర పురస్కారాలు లభించాయి. వీరిలో పఠాన్ కోట్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కూడా ఉన్నారు. 'సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో ఖుర్బానీ' నినాదంతో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నవేళ జాతియావత్తూ పోరాటయోధులు, సైనిక అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నది. (ఆర్మీ దుస్తులే ప్రాణంగా బతికాడు..)