
సీబీఐ సోదాలపై స్పందించిన హజారే
ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు జరపడంపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు.
రాలెగావ్ సిద్ధి(మహారాష్ట్ర): ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు జరపడంపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ పై గతంలోనే చర్య తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించే ముందే రాజేంద్ర కుమార్ గత చరిత్రను గురించి తెలుసుకుని ఉండాల్సిందని కేజ్రీవాల్ కు సూచించారు.
'ఈ ఘటన(అవినీతి ఆరోపణలు) అరవింద్ కేజ్రీవాల్ హయాంలో జరగలేదు. ఈ కేసుపై ఏడాదిన్నర నుంచి బీజేపీ ఎటువంటి చర్య తీసుకోలేదు. రాజేంద్ర కుమార్ పై కచ్చితంగా గతంలోనే చర్య తీసుకోవాల్సింది' అని రాలెగావ్ సిద్ధిలో విలేకరులతో హజారే అన్నారు. తన చట్టూ దృఢమైన వ్యక్తిత్వం గలవారు ఉండేలా చూసుకోవాలని కేజ్రీవాల్ కు ఎప్పుడూ చెబుతుంటానని వెల్లడించారు. రాజేంద్ర కుమార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు మంగళవారం ఆయన కార్యాలయంలో సోదాలు చేశారు. సీఎం ఆఫీసులోనూ సీబీఐ దాడులు చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.