
భార్యను మోసం చేశాను.. సారీ!
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను మోసం చేశానని చైనా బాడ్మింటన్ సూపర్ స్టార్ లిన్ డాన్ అంగీకరించడం సంచలనం రేపుతోంది. ఇటీవలే లిన్ డాన్ భార్య తమ తొలిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ‘మిస్టరీ మహిళ’తో లిన్ డాన్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. ‘డిటెక్టివ్ ఝావో’ అనే నెటిజన్ ఆన్‌లైన్‌లో పోస్టుచేసిన ఈ ఫొటోలు లిన్ డాన్ అభిమానుల్ని షాక్‌కు గురిచేశాయి. లిన్‌తో తిరిగిన సదరు మహిళ ప్రముఖ మోడల్, నటి ఝావో యాకిగా తేలింది. గత సెప్టెంబర్ నెలలో ఓ రెస్టారెంట్ వద్ద లిన్, యాకీ సన్నిహితంగా తిరుగుతుంటే తాను గమనించి.. వారిని అనుసరించానని, లిన్ యాకీని తన ఇంటికి తీసుకెళ్లాడని, రెండుగంటలు గడిపిన అనంతరం వారు బయటకు వచ్చారని, ఆ తర్వాత ఒక హోటల్‌లోను వారు రాసలీలలు నెరిపారని డిటెక్టివ్ ఝావో పేర్కొన్నాడు.

