చాయ్ వాలాకు ఎన్నో అవార్డులు..! | He has Won Praises Why He Selling Tea Then? | Sakshi
Sakshi News home page

చాయ్ వాలాకు ఎన్నో అవార్డులు..!

Published Wed, Sep 2 2015 12:41 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

చాయ్ వాలాకు ఎన్నో అవార్డులు..!

చాయ్ వాలాకు ఎన్నో అవార్డులు..!

ఢిల్లీలో హిందీ భవన్‌ ఎదురుగా ప్లాట్‌ఫామ్‌పై ఓ టీ కొట్టు.. అందులో టీ అమ్ముతూ కనిపించే ఆరు పదుల వయసు దాటిన ఓ వృద్ధుడు.  ఆ పక్కనే అందంగా పేర్చిన పుస్తకాలు. ఢిల్లీ బస్తీవాలాగా జీవితం సాగిస్తున్న లక్ష్మణ్ రావు..18 ఏళ్ళ వయసులోనే రచనలకు శ్రీకారం చుట్టాడు. ప్రధానమంత్రి , రాష్ట్రపతి నుంచీ అవార్డులు అందుకున్నాడు. కానీ నేటికీ టీ అమ్ముకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు.

లక్ష్మణ్ రావు దైనందిన జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలే పాత్రలుగా ఎన్నో రచనలు చేశాడు. మరెన్నో అవార్డులూ అందుకున్నాడు. అయినా ఆ టీకొట్టునే నమ్ముకున్నాడు. అరవై మూడేళ్ళ వయసులోనూ ఉదయం టీ కొట్టు నడుపుతూనే రాత్రి రచనలు చేస్తూ తన ఇద్దరు కొడుకులనూ చదివిస్తూ తానూ ఢిల్లీ విశ్వవిద్యాలయం ద్వారా ఎంఏ చదువుతున్నాడు.

చాయ్ వాలా లక్ష్మణ్ రావ్ కు పల్లె పరిమళాలూ తెలుసు, నగరాల నయా జమానా తెలుసు. పాఠశాల వయసులోనే జీవిత పాఠాలను నేర్చుకున్న ఆయన స్నేహితుల ప్రోత్సాహంతో రచనారంగంలో అడుగు పెట్టాడు. మహారాష్ట్ర తారే గావ్‌ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌రావు ఎనిమిదో తరగతి డ్రాపౌట్ అయి పనికోసం నగరాల బాట పట్టాడు. ప్రఖ్యాత హిందీ నవలాకారుడు గుల్షన్ నంద రచనలు చదివి సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. ఎప్పటికైనా తాను గుల్షన్ నంద అంతటి వాడవ్వాలని కలలుగన్నాడు. 

లక్ష్మణ్ పుట్టిన గ్రామంలో స్కూళ్ళు లేవు. ఆమ్రావతి వెళ్ళి చదువుకునేవాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులకు తానూ సాయమందించడంలో భాగంగా చదువుకుంటూనే స్పిన్నింగ్ మిల్లులో పనిచేశాడు. అక్కడ సంపాదన సరిపోక కుటుంబంతోపాటు  రాజధానికి పయనమయ్యాడు. మొదట్లో పాన్ బడ్డీ పెట్టుకుని పొట్ట నింపుకున్నాడు. తర్వాత చాయ్ దుకాణం ప్రారంభించాడు. పని చేస్తూనే దూర విద్యలో బీఏ పూర్తి చేశాడు.

హిందీ రచనలెన్నో చదివిన లక్ష్మణ్ రావు సాహిత్యంపై మక్కువతో తానూ ఓ పుస్తకాన్ని రాయాలని ప్రయత్నించాడు. ముందుగా 'నయీ దునియా కీ నయీ కహానీ' పేరిట గ్రామం నుంచీ ఢిల్లీ వరకూ సాగిన తన పయనాన్ని పుస్తకంగా మలిచాడు. ఎంతోమంది పబ్లిషర్లను ఆశ్రయించాడు. ఓ చాయ్ వాలా పుస్తకం రాయడంపై వారికి నమ్మకం కలగలేదు. కొందరు ఎగతాళికూడ చేశారు. తర్వాత కాస్త డబ్బు కూడబెట్టి తన 18 ఏళ్ళ వయసులో మొదటి పుస్తకాన్ని అచ్చు వేయించాడు. ఊరంతా తిరిగి అమ్మాడు. లైబ్రరీలకు, షాపులకు ఇచ్చాడు. కొత్త పుస్తకానికి వచ్చిన స్పందనపై వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత లక్ష్మణ్ రావు భారతీయ సాహిత్య  కళా ప్రకాశన్ పేరిట స్వయంగా పబ్లిషింగ్ హౌస్ ను రిజిస్టర్ చేసుకున్నాడు.  

చదువుకునే రోజుల్లో నదిలో పడి కొట్టుకుపోయిన తన స్నేహితుడు రామదాస్ యధార్థగాథ లక్ష్మణ్ రావు రెండో పుస్తకంలో అక్షరంగా మారింది.  'రామ్‌దాస్‌' నవలకు అవార్డు దక్కడంతో పాటు దాన్ని నాటకంగా కూడ మలిచారు. నాటకమూ విజయవంతమై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దృష్టిలో పడింది. ఆమె లక్ష్మణ్‌రావును ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించి గౌరవించారు. ఇప్పటి వరకు 28 పుస్తకాలు రాయగా, 'రేణు' అనే నవలను మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ చదివి లక్ష్మణ్‌ రావుపై ప్రశంసలు కురిపించారు. స్వయంగా ఆహ్వానించి రాష్ట్రపతి భవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు. రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన ప్రస్తుతం 'ప్రధాన మంత్రి', బారిస్టర్ గాంధీ, 'పరంపర సే జుడీ భారతీయ రాజ్‌నీతి', 'పట్టియోంకీ సరసాత్‌' ‌'నర్మద‌' ‌'అహంకార్‌' ‌'అభివ్యక్తి‌' ఇలా మరెన్నో రచనలను త్వరలో ఆవిష్కరించనున్నారు.

లక్ష్మణ్ రావు ఎవరి దగ్గరనుంచీ ఎటువంటి నిధులు, విరాళాలు స్వీకరించడు. ఎవరైనా ఇచ్చేందుకు ముందుకొచ్చినా సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇవ్వాలనుకునే వారు తన పుస్తకాలు కొని చేయూతనిమ్మంటాడు. జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నానని, భవిష్యత్ లో పుస్తకాల అమ్మకాలు ఎక్కువైతే టీ అమ్మడం మానుకుని, పూర్తి సమయాన్ని రచనలకే వినియోగిస్తానని చెప్తున్న లక్ష్మణ్ ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నాడు. ఇంద్రప్రస్థ సాహిత్య భారతీ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆయన్ను  స్థానికులు నేటికీ చాయ్ వాలా లేఖక్ గా పిలుచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement