
ఎంపీ, మిజోలలో భారీ పోలింగ్
మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం జరిగిన పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
భోపాల్/ఐజ్వాల్: మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం జరిగిన పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్‌లో దాదాపు 70 శాతం, మిజోరంలో 81 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఓటర్లను ప్రలోభపెడుతున్నందుకు రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి రంజనా బఘేల్‌పై కేసు నమోదైంది.
భిండ్ జిల్లా లహర్ నియోజకవర్గంలో కొన్నిచోట్ల అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని, అయితే, ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని మధ్యప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి జయదీప్ గోవింద్ చెప్పారు. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందన్నారు. భిండ్ జిల్లాలో నాలుగు, మోరేనా జిల్లాలో మూడు హింసాత్మక సంఘటనలు జరిగాయని, ఏడుగురు గాయపడ్డారని చెప్పారు. కాగా, మోరేనా జిల్లా సుమావలి నియోజకవర్గంలో ఒక వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు. నాయక్‌పురా పోలింగ్ కేంద్రం నుంచి ఈవీఎంతో పారిపోతుండగా అతడిపై బీఎస్‌ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. మృతుడిని సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువైన భురాసింగ్ కన్సానాగా గుర్తించారు. ఖర్గోనే జిల్లా కాస్రవాడ్ నియోజకవర్గంలోని సాది గ్రామంలో బీజేపీ కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో కాలూ యాదవ్ అనే కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడు.
బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టుల ప్రాబ ల్యమున్న మూడు నియోజకవర్గాల్లో గట్టి భద్రత నడుమ పోలింగ్ నిర్వహించామని అధికారులు తెలిపారు. సరైన రోడ్లు నిర్మించలేదనే ఆగ్రహంతో పది జిల్లాలకు చెందిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారన్నారు. చౌరాయ్‌లో ఒక ఈవీఎంను అల్లరి మూకలు బద్దలుకొట్టినా, స్వల్ప విరామం తర్వాత పోలింగ్ యథాప్రకారం కొనసాగిందని చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. బీజేపీ హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో, ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సర్వశక్తులనూ ప్రయోగించాయి. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధ్ని, విదిష నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా, సీఎల్పీ నేత అజయ్ సింగ్ విదిష జిల్లాలోని చుర్హాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన మెజారిటీని కాంగ్రెస్ సునాయాసంగా సాధిస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
మరోవైపు, తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాల నుంచి 2,583 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్రంలోని 51 జిల్లాల్లో 53,896 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాల నుంచి 142 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీటిలో లుంగ్లెయ్ సౌత్ మినహా మిగిలినవన్నీ ఎస్టీ రిజర్వుడు స్థానాలే కావడం విశేషం. ఓటరు తాను ఎవరికి ఓటేసిందీ సరిచూసుకునేందుకు వీలు కల్పించే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా మిజోరంలో ఈసారి 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రవేశపెట్టారు. మిజోరంలోని చంఫాయి జిల్లా లెంగ్టెంగ్ నియోజకవర్గంలో ఒక శతవృద్ధురాలు సోమవారం ఓటు హక్కును ఉపయోగించుకుంది. ఈ నియోజకవర్గంలోని ఈశాన్య ఖావ్‌డుంగ్సీ-2 పోలింగ్ కేంద్రంలో కిమ్‌చాంగీ (104) ఓటు హక్కును వినియోగించుంది. ఎంఎన్‌ఎఫ్, మరాలాండ్ డెమొక్రటిక్ అలయన్స్‌లతో కూడిన మిజోరం ప్రజాస్వామిక కూటమికి, అధికార కాంగ్రెస్‌కు మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది.