టూ వీలర్స్ పై భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాల నేపథ్యంలో ఉన్న స్టాక్ ను విక్రయించేందుకు దేశీయ ఆటో కంపెనీలు ఆగమేఘాల కదులు తున్నాయి. బీఎస్-3 వాహనాలను నిషేధిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో ప్రముఖ టూవీలర్ మేజర్లు భారీ డిస్కౌంట్లను ఆఫర్లను ప్రకటించాయి. డీలర్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం మార్కెట్ లీడర్‌హీరో మోటార్ కార్ప్ స్కూటర్లపై రూ.12500, ప్రీమియం బైక్స్‌పై రూ.7500, ఎంట్రీ లెవర్ మెటార్ సైకిళ్లపై రూ.5వేల దాకా తగ్గింపును ప్రకటించింది. అలాగే హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అయితే బీఎస్-3 స్కూటర్లపై కొనుగోలుపై రూ. 10వేల డిస్కౌంట్ అంద్తిస్తోంది. స్టాక్ అయిపోయే దాకా లేదా మార్చి 31 దాకా ఆ ఫర్ వర్తించనున్నట్టు ఇరు కంపెనీలు ప్రకటించాయి.
టూవీలర్స్ ఇండస్ట్రీలో ఈ రాయితీలను ఎప్పుడూ చూడలేదని ఆటోమొబైల్ డీలర్స్ ఫెడరేషన్, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ నికుంజ్ సాంగ్వి పిటిఐకి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీలర్స్ చర్యలు గురించి అడిగినప్పుడు, గడువులోపు సాధ్యమైనన్ని వాహనాలను విక్రయించడంపైనే అంతా దృష్టి పెట్టినట్టు తెలిపారు.
కాగా ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాలను అమ్మకాలను, రిజిస్ట్రేషన్ నిషేధిస్తూ సుప్రీం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కాలుష్య నివారణలో భాగంగా తయారీదారుల వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యం చాలా చాలా ముఖ్యమైన సుప్రీం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.