అయోధ్యలో తాము తలపెట్టిన ర్యాలీని ఆపే ప్రసక్తి లేదని వీహెచ్పీ స్పష్టం చేయడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరు జిల్లాల సరిహద్దులను మూసేసి, భద్రతను గణనీయంగా పెంచింది.
అయోధ్యలో తాము నిర్వహించ తలపెట్టిన ర్యాలీని ఆపే ప్రసక్తి లేదని వీహెచ్పీ స్పష్టం చేయడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరు జిల్లాల సరిహద్దులను మూసేసి, భద్రతను గణనీయంగా పెంచింది. ఈ యాత్రను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ వీహెచ్పీ యాత్రను అనుమతించే ప్రసక్తి లేదని హోంశాఖ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో అదనపు భద్రతా బలగాలను మోహరించడంతో పాటు మొత్తం మార్గమంతా బారికేడింగ్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పది కంపెనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పన్నెండు కంపెనీల ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టాబ్యులరీ దళాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇతర రాష్ట్రాల ప్రజలు అయోధ్యలో ప్రవేశించకుండా ఉత్తర్వులు జారీచేసినట్లు ఐజీపీ రాజ్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. వీహెచ్పీ ర్యాలీని ఎలాగైనా అడ్డుకోవాలని యూపీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ర్యాలీ ఈనెల 25 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఈ యాత్ర హిందువుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి దాన్నుంచి వెనుదిరిగేది లేదని వీహెచ్పీ తెలిపింది. తమ పార్టీలోని ముస్లిం నేతల ఒత్తిడి వల్లే సీఎం అఖిలేష్ యాదవ్ ఇలా వ్యవహరిస్తున్నారని స్వామి చిన్మయానంద ఆరోపించారు. అభివృద్ధి శాఖ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ మీద ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఆరోపణలను యూపీ మంత్రి శివపాల్ యాదవ్ తిరస్కరించారు. మతసామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.