
ట్రంప్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కుటుంబ ఫౌండేషన్‌కు అందిన విరాళాల విషయమై రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్-అమెరికా పౌర అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటేసినందుకుగాను భారతీయ రాజకీయ నాయకులు, భారతీయ సంస్థల నుండి ఆమెకు నిధులు అందాయని ఆరోపించారు.
హిల్లరీ క్లింటన్‌కు అందిన విరాళాల విషయమై గతంలోనూ డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైన ఆరోపణలు చేశారు. తాజాగా ట్రంప్ ప్రచార బృందం విడుదల చేసిన 35 పేజీల బుక్‌లెట్‌లో హిల్లరీకి అందిన నిధులపై ఆరోపణలు గుప్పించారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీపడటం దాదాపు ఖాయమైన నేపథ్యంలో హిల్లరీపై ట్రంప్ ఆరోపణల జోరు పెంచారు. న్యూయార్క్‌లో ఈ వారం ట్రంప్ చేసిన ప్రంసగంలోని టాప్ 50 నిజాల పేరిట ఈ బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
2008లో భారత రాజకీయ నాయకుడు అమర్ సింగ్ క్లింటన్ ఫౌండేషన్ కు పది లక్షల డాలర్ల నుంచి 50 లక్షల డాలర్ల వరకు విరాళాలు ఇచ్చాడంటూ న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని పేర్కొంటూ ట్రంప్ ప్రచార బృందం ఆరోపణలు చేసింది. 2008లో సెప్టెంబర్‌లో అమర్ సింగ్ అమెరికాను సందర్శించి అణు ఒప్పందం కోసం లాబీయింగ్ చేశారని, అప్పటి సెనేటర్ గా ఉన్న క్లింటన్ అణు ఒప్పందాన్ని అడ్డుకోబోమని హామీ ఇచ్చిందని, ఇందుకు ప్రతిఫలంగానే ఆమె ఫౌండేషన్ కు నిధులు అందాయని పేర్కొన్నారు.