అక్కడ హిందూ మహిళలకు నరకం
కరాచి: పాకిస్తాన్‌లో హిందువులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. వారిపై కొనసాగుతున్న అత్యాచారాలను అంతులేకుండా పోతోంది. బలవంతపు మత మార్పిడులకు, అత్యాచారాలకు, కిడ్నాప్‌లకు గురవుతున్నారు. జీవితాంతం సెక్స్ బానిసలుగా బతుకీడుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం... పాకిస్తాన్‌లో హిందువుల వివాహానికి చట్టమంటూ లేకపోవడమే. అక్కడి హిందూ మహిళలెవరూ తమకు పెళ్లయిందని నిరూపించుకోలేరు. ఈ కారణంగా భర్త మరణిస్తే అతని పేరిట ఉన్న ఆస్తులేవీ భార్యకు దక్కవు. భర్తపోతే రోడ్డున పడాల్సిందే. లేదా మత మార్పిడి చేసుకొని ఓ ముస్లిం వద్ద నాలుగో భార్యగానో, ఐదో భార్యగానో బానిస బతుకు బతకాల్సిందే.
స్వాతంత్య్రానంతరం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పాక్‌లో హిందువుల వివాహ చట్టం కోసం అటు పాకిస్తాన్ ప్రభుత్వంగానీ, ఆ దేశంతో ప్రజా సంబంధాలను బలంగా కోరుకుంటున్నామని పదే పదే చెప్పే భారత ప్రభుత్వంగానీ చిత్త శుద్ధిగా ఎలాంటి చ ర్యలు తీసుకోలేదు. 2008, 2011, 2012లలో హిందూ వివాహ చట్టం కోసం పాకిస్తాన్ పార్లమెంట్ బిల్లులు తీసుకొచ్చింది. అయితే సంకుచిత రాజకీయాల కారణంగా ఆ బిల్లులు పార్లమెంట్ ఆమోదానికి నోచుకోలేదు. ఈ ఏడాది గత జూలై నెలలో మరోసారి బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే మూలన పడేసింది.
పాకిస్తాన్‌తో చర్చలకు అవకాశం వచ్చినప్పుడల్లా భారత ప్రభుత్వం రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యత ఇచ్చింది తప్పా పాక్‌లోని హిందువుల పరిస్థితికి ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు. అక్కడ అరాచకాలను తట్టుకోలేక భారత్ శరణుజొచ్చిన హిందువుల కుటుంబాలకు కాందిశీకుల కింద ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చిందేతప్పా వారికి పౌరసత్వం కూడా ఇవ్వలేదు.
హిందువులు ఎక్కువగా ఉంటున్న సింధు రాష్ట్రంలో కూడా వివాహ చట్టం లేకపోవడం వల్ల హిందూ మహిళలు దారుణ పరిస్థితులను ఎదొర్కుంటున్నారని ప్రముఖ చరిత్రకారుడు సురేందర్ కొచ్చార్ తెలియజేశారు. కనీసం హిందువులకు పాకిస్తాన్‌లోని ‘నేషనల్ డేటాబేస్ రెగ్యులేషన్ అథారిటీ’ కింద గుర్తింపు కార్డులు పొందే అవకాశం కూడా లేదని రహీం యార్ ఖాన్ సిటీలోని హైకోర్టు అడ్వకేట్ అమర్ నదీమ్ తెలిపారు. నదీప్ పాకిస్తాన్‌లోని మైనారిటీల పట్ల ప్రభుత్వ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.