
మిత్ర లాభమా? భేదమా?
ఒకప్పటి మిత్రులు.. ఆ తర్వాత మొన్నటి వరకూ బద్ధ శత్రువులు.. జేడీయూ అగ్రనేత నితీశ్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలుప్రసాద్‌లు..
లాలు-నితీశ్ ఓట్ల లెక్కలు ఫలించేనా?
లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్ ఓట్లన్నీ కలిపితే ఎన్‌డీఏ కన్నా 5% అధికం
ఆ మూడు పార్టీలకు పోలైన ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి పోలైతే గెలుపు సులభమే
కానీ అగ్రనేతలు ఇరువురి మద్దతుదారులైన యాదవులు, కుర్మీల మధ్య సుదీర్ఘ విభేదాలు
సెంట్రల్ డెస్క్: ఒకప్పటి మిత్రులు.. ఆ తర్వాత మొన్నటి వరకూ బద్ధ శత్రువులు.. జేడీయూ అగ్రనేత నితీశ్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలుప్రసాద్‌లు.. తాజా శాసనసభ ఎన్నికల కోసం మళ్లీ మిత్రులుగా మారారు. వారితో కాంగ్రెస్ జతకట్టటంతో.. మూడు పార్టీలూ మహాకూటమిగా ఎన్నికల బరిలోకి దిగాయి. అయితే.. నితీశ్ - లాలు స్నేహం ఎన్నికల బరిలో ఫలితాన్నిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. వాస్తవానికి 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఫలితాలను చవిచూశాయి. అయితే.. ఈ మూడు పార్టీలకూ విడివిడిగా వచ్చిన ఓట్ల శాతాన్ని కలిపితే.. అవి బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కన్నా ఐదు శాతం ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. ఈ పార్టీలు దాదాపు 130 అసెంబ్లీ స్థానాల్లో ఎన్‌డీఏ కన్నా ముందున్నాయి. అంటే.. ఈ కూటమిలోని పార్టీలు గత లోక్‌సభ ఎన్నికల్లో తమకు వేర్వేరుగా పోలైన ఓట్లను కూటమిగా సాధించగలిగితే.. వారి విజయం నల్లేరు మీద నడకే. ఈ ఓట్ల లెక్కలతోనే నితీశ్, లాలుల మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. మరి ఈ కూడికలు క్షేత్రస్థాయిలో నిజమవుతాయా?!
శ్రేణుల్లోనూ స్నేహం ఉంటుందా?
లాలు - నితీశ్‌లు శత్రుత్వాన్ని పక్కనపెట్టి మళ్లీ ఆలింగనం చేసుకుని మిత్రత్వం ప్రకటించినంత సులభంగా ఎన్నికల బరిలో వారి పార్టీల శ్రేణులు కలసిపోవటం కష్టమని బిహార్ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ముందు లాలు, నితీశ్‌లు తమ తమ సొంత మద్దతుదారులైన యాదవులు, కుర్మీల మధ్య సయోధ్య సాధించాల్సి ఉంటుందనేది వారి మాట. ఈ రెండు వర్గాల వారి మధ్య విభేదాలకు బలమైన చరిత్రే ఉంది. వాస్తవానికి లాలుప్రసాద్ జనతాదళ్ పార్టీ నుంచి నితీశ్‌కుమార్ చీలిపోవటానికి.. తద్వారా తొలుత సమతా పార్టీ, ఆ తర్వాత జనతాదళ్ (యునెటైడ్) పార్టీ ఆవిర్భావానికి మూలాలు 1994 కుర్మీలలో పెల్లుబికిన అసంతృప్తిలో ఉన్నాయి.
నాటి లాలు పాలనలో యాదవులే అన్ని ప్రయోజనాలూ పొందుతున్నారని.. కుర్మీలు విస్మరణకు గురవుతున్నారన్నది ఆ అసంతృప్తి. ఆర్‌జేడీ, జేడీయూ మద్దతుదారులుగా చీలిపోయిన ఈ రెండు వర్గాల మధ్య ఆ విభేదాలు ఇంకా ఎంతోకొంత కొనసాగుతూనే ఉన్నట్లు ఇటీవలి కాలంలో నిర్వహించిన పలు సర్వేల్లో కనిపిస్తోంది. నితీశ్ మద్దతుదారుల్లో నాలుగో వంతు మంది లాలును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. లాలు మద్దతుదారుల్లోనూ నాలుగో వంతు మంది నితీశ్‌ను ఏమాత్రం ఇష్టపడటం లేదని 2014 ఆరంభంలో నిర్వహించిన ఆ సర్వే అంచనా. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఇరువురు అగ్రనేతలూ తమ తమ ఓట్లు పరస్పరం బదిలీ అయ్యేలా చూడటం ఎంతవరకూ సాధ్యం అన్నది ప్రశ్న!
లాలు పాలన అపకీర్తిని పోగొడతారా?
ఇక లాలు పాలనపై ప్రజల్లో ఉన్న చెడ్డ పేరు.. ప్రత్యేకించి నితీశ్ మద్దతుదారుల్లో ఉన్న వ్యతిరేకత కూడా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. నితీశ్ గత పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ‘వికాస్‌పురుష్’గా అభివృద్ధి, సుపరిపాలనకు ఆద్యుడిగా కీర్తిగడించారు. అటువంటి నేత.. అపకీర్తి మూటగట్టుకున్న లాలుతో ఇప్పుడు జట్టుకట్టటాన్ని ఆయన మద్దతుదారులు, ప్రత్యేకించి మధ్యతరగతి వర్గం వారు ఆమోదించలేకపోవచ్చని భావిస్తున్నారు. ఇదిలావుంటే.. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థుల ప్రచారం ప్రధానంగా ప్రస్తుత, గత ప్రభుత్వాల పనితీరును పోల్చుతూ సాగుతుంది. గత రెండు ఎన్నికల్లో లాలు హయాన్ని ఎండగట్టి అధికారం చేపట్టిన నితీశ్‌కు.. ఇప్పుడు అదే లాలుతో కలసి ఎన్నికలకు వెళ్లటంతో ఆ అవకాశం లేదు. ఆపైన.. లాలు గత పాలనను ‘జంగల్ రాజ్’ (ఆటవిక పాలన)గా అభివర్ణిస్తూ.. వారి కూటమిని గెలిపిస్తే మళ్లీ అదే పాలన తిరిగివస్తుందని బీజేపీ తన దాడిని ముమ్మరం చేసింది. ఈ పరిస్థితుల్లో.. ప్రజల్లో ఆ భయాలను తొలగించటంతో పాటు.. లాలు హయాంలోని కొన్ని వ్యవహారాలనూ సమర్థించుకోవాల్సిన పరిస్థితిలో నితీశ్ కుమార్ ఉన్నారు.
మహా కూటమి గెలిస్తే అరాచకమే: జైట్లీ
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ మహా కూటమి గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ అరాచకం మొదలవుతుందని కేంద్రమంత్రి జైట్లీ అన్నారు. గురువారం పట్నాలో ఆయన ఎడ్డీయే కూటమి తరఫున ఎన్నికలకు సంబంధించి విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. తమ కూటమికి పట్టంకడితే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
లాలుకు ఈసీ నోటీసు: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులతత్వ ప్రకటనలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌కు ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది.
‘మోదీ హామీలేమయ్యాయి’: లౌకిక కూటమి కేంద్రంలోని నరేంద్రమోదీ వైఫల్యాలపై ఓ వీడియోను విడుదల చేసింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే ఇచ్చిన హామీలను అటకెక్కించించిన తీరును ఇందులో వివరించారు. ముఖ్యంగా భారత్‌కు చెందిన బడాబాబులు పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి ప్రతీ పౌరుడికి 15 నుంచి 20 లక్షలవరకు ఇస్తామని చేసిన వాగ్దానం ఏమైందని ఈ చిత్రంలో ప్రశ్నించారు.
ఎన్నికలు మోదీకి పరీక్ష వంటివి: బిహార్ ఎన్నికలు మోదీకి పరీక్షవంటివని అమెరికాకు చెందిన మేధావి వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అవి మిగతా ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.