
పెద్ద నోట్ల రద్దుతో టమాటో విలాపం
న్యూఢిల్లీ: ఎర్రగా నిగనిగలాడే టమోటాకు కూరగాయల్లో ఎప్పుడూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఏ కూరగాయతో కలిపి వండినా ఇట్టే కలసిపోయి కమ్మని రుచిని ఇస్తుందికనుక. ప్రతి ఏటా చలికాలంలో టమాటో ధరలు రెట్టింపు అవుతాయి. అవి చలిని తట్టుకొని ఎక్కువ కాలం తాజాగా ఉండలేవుకనుక. ఈసారి టమాటో పరిస్థితి తలకిందులైంది. ధరలు దారుణంగా పడిపోయాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోను కిలోకి మూడు నుంచి ఐదు రూపాయల వరకు ధర పలుకుతోంది.
ప్రభుత్వ మార్కెటింగ్ కమిటీల నుంచి అందిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మూడు, కర్ణాటకలో నాలుగు, మహారాష్ర్టలో ఐదు రూపాయలు పలుకుతోంది. అస్సాం, జార్ఖండ్, నాగాలాండ్‌లలో మాత్రమే ధరలు తగ్గలేదు. మిగతా కూరయాల విషయంలో 20 రాష్ట్రా నుంచి అందిన సమాచారం మేరకు 8 రాష్ట్రాల్లో 50 నుంచి 62 శాతం వరకు ధరలు తగ్గాయి. ఈ సీజన్లో కాలిఫ్లవర్, క్యారెట్లు సహజంగానే తగ్గుతాయిగనుక అవి అలాగే ఉన్నాయి. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్లనే ధరలు ఇలా పడిపోతున్నాయని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, పింపిల్‌గావ్ దేశంలోకెల్లా అతిపెద్ద టమాటో మార్కెట్. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ మార్కెట్ ఈసారి బోసి పోయింది. ఈ మార్కెట్ మొత్తంగా నగదు లావాదేవీల ద్వారానే నడుస్తుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో చెక్కులను ఆశ్రయించాల్సిన అవసరం వచ్చింది. అయితే ఇక్కడి మార్కెట్ వ్యాపారులు చెక్‌ల తీసుకునేందుకు, ఇచ్చేందుకు సిద్ధంగా వున్న చెక్కులు తీసుకునేందుకు రైతులు సిద్ధంగా లేరని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దిలీప్ బాంకర్ మీడియాకు తెలిపారు. ఈ మార్కెట్‌కు బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వ్యాపారలు వచ్చి టమోటోను కొనుగోలు చేసేవారని, ఇప్పుడు వారి రాక పడిపోయిందని చెప్పారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో రవాణా చార్జీలు కూడా రావనే ఉద్దేశంతో రైతులెవరూ టమాటోలు విక్రయించేందుకు రావడం లేదని ఆయన వివరించారు.
భారత్ నుంచి పెద్ద ఎత్తున టమాటోను దిగుమతి చేసుకుపోయే దేశం పాకిస్తాన్. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జమ్మూ నుంచి ఆ దేశానికి టమాటో ఎగుమతులు నిలిచిపోయాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగా స్థానికంగా కూడా విక్రయాలు బాగా తగ్గిపోయాయని, సరైన వ్యాపారం లేక తాము సతమతమవుతున్నామని జమ్మూ పళ్లు, కూరగాయదారుల సంఘం అధ్యక్షులు రొమేశ్ పరిహార్ వ్యాఖ్యానించారు. బంగాళ దుంపల ధరలు కూడా బాగా పడిపోయాయని మార్కెట్ వర్గాలు, ముఖ్యంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.