
నో‘టమాట’ రావట్లే..
టమాటా విక్రయాలపై ‘పెద్ద’ప్రభావం
ఇల్లెందు: రూ.1,000, రూ.500 నోట్ల రద్దు ప్రభావం టమాటా రైతులపై పడుతోంది. కొనుగోళ్లులేక వారు ఇబ్బంది పడుతున్నారు. నోట్ల రద్దుకు ముందు టమాట కేజీ రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.3కు పడిపోరుుంది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం గ్రామంలో రైతులు చిర్ర సురేష్, మచ్చే యాదగిరి తదితరులు మార్కెట్‌కు టమాటాలు తీసుకొచ్చి.. ధర లేకపోవడంతో అక్కడే కుప్పలుగా పోసి వదిలేశారు. ఎకరానికి రూ.20వేల నుంచి రూ.30వేలు పెట్టుబడి పెట్టామని..గతంలో బాక్స్ టమాటాలను రూ.1,000కు విక్రరుుంచామని, ఇప్పుడు రూ.100 నుంచి రూ.200 మాత్రమే ధర పలుకుతోందని రైతులు తెలిపారు.
గతేడాది కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చిమరీ వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వ్యాపారులెవరూ ముందుకు రావట్లేదు. ఇల్లెందుకు తీసుకెళ్లి అమ్ముకుందామంటే..పెద్ద నోట్ల ప్రభావంతో..ఎవరూ కొనడం లేదు. కేజీ టమాట కొన్నా రూ.2వేల నోటు ఇస్తున్నారని, వ్యాపారులు కూడా చిల్లర కరెన్సీ లేదని కొనుగోలు చేయడం లేదని రైతులంటున్నారు. సరుకు రెండు రోజుల్లోనే దెబ్బతింటుండడంతో ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే చేసేది లేక ఇలా పారబోస్తున్నామని రైతులు చెప్పారు.