బ్లాక్‌మనీపై ఈ సలహా.. వైరల్!
-
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశం
నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చనే రేకెత్తిస్తున్నది. పెద్దనోట్ల రద్దుకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మరోవైపు పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లధన కుబేరులు కొన్ని అక్రమ చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి కొందరు అక్రమమార్గాలు తొక్కడమే కాదు.. అలా కుదరనప్పుడు నల్లధనం దొరకకుండే ఉండేందుకు రూ. 500, వెయ్యినోట్లను చించిపారేయడం, తగలేయడానికి వెనుకాడటంలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ట్విట్టర్ పేరిట అకౌంట్ కలిగిన ఓ నెటిజన్ ఓ ఆసక్తికరమైన వాట్సాప్ మెసేజ్‌ను సోషల్ మీడియాలో పెట్టాడు. బ్లాక్ మనీపై ప్రధాని నరేంద్రమోదీకి సలహా ఇస్తూ అతను పెట్టిన ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'ఇండియన్ ఆర్మీ పేరిట ఒక బ్యాంకు ఖాతాను ఏర్పాటుచేయండి. ప్రజలు ఆ ఖాతాలో ఎంత డబ్బు డిపాజిట్ చేసినా.. ఎలాంటి విచారణకానీ, దర్యాప్తుకానీ ఉండదని ప్రకటించండి. దీంతో చాలామంది తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఈ ఖాతాలో డిపాజిట్ చేసే అవకాశముంటుంది. దీంతో నల్లధనం రూపంలో ఉన్న నగదు ధ్వంసం కాదు. అంతేకాకుండా ఆ సోమ్ము దేశ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చు' అంటూ ప్రధాని మోదీకి సలహా ఇస్తూ సాగిన ఈ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఈ సలహాపై మీరేమంటారు..?