జేఈఈ అడ్మిట్ కార్డుల కోసం విద్యార్థుల తంటాలు
హైదరాబాద్: జాయింట్ ఎంట్రెన్స్ ఎక్జామినేషన్ (జేఈఈ మెయిన్-2017) కు హాజరయ్యే విద్యార్థులు మంగళవారం నుంచి తమ అడ్మిట్ కార్డుల (హాల్ టికెట్లు) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్ఈ ప్రకటించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడంతో పాటు సెక్యూరిటీ పిన్ నంబర్ నమోదు చేయడం ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్ఈ తెలిపింది. జేఈఈ అడ్మిట్ కార్డులన్నీ ఆన్ లైన్ ద్వారా మాత్రమే పొందడానికి వీలుంటుంది. అభ్యర్థులకు వ్యక్తిగతంగా అడ్మిట్ కార్డులను పంపడం జరగదు.
అయితే, అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం ఎక్కడ పడిందో తెలుసుకోవాలన్న తపనలో మంగళవారం సైట్ ఓపెన్ చేసి తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారని సమాచారం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరువుతున్న ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఒక్కసారిగా వెబ్ సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించడంతో సైట్ ఎంతకూ ఓపెన్ కాలేదని విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇదే సమస్య. అయితే లక్షలాదిగా అభ్యర్థులు ఒక్కసారిగా ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన కారణంగానే సైట్ నెమ్మదించిందని అధికారులు చెబుతున్నారు.