హెచ్‌యూఎల్ లాభం రూ. 962 కోట్లు
క్యూ2లో 3% తగ్గుదల ఒక్కో షేర్‌కు రూ. 6.5 డివిడెండ్
న్యూఢిల్లీ: హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) కంపెనీ నికర లాభం(స్టాండ్‌ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 3 శాతం తగ్గింది. ఎక్సైజ్ సుంకం రాయితీల కాలపరిమితి తీరిపోవడం, ధరల తగ్గింపు కారణాల వల్ల నికర లాభం తగ్గిందని హిందూస్తాన్ యూనిలీవర్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.988 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ2లో రూ.962 కోట్లకు తగ్గిందని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. నికర అమ్మకాలు మాత్రం రూ.7,466 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.7,820 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. వ్యయాలు రూ.6,474 కోట్ల నుంచి 4 శాతం పెరిగి రూ.6,706 కోట్లకు. పన్ను వ్యయాలు 7 శాతం పెరిగి రూ.446 కోట్లకు చేరాయని చెప్పారు.
ముడి పదార్థాల ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకు ధరలు తగ్గించామని వివరించారు. తక్కువ ధరల్లో ముడి పదార్థాలు లభించడం కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నామని, హెచ్‌యూఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిబి. బాలాజి చెప్పారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్లలో తమ నికరలాభం(స్టాండ్‌ఎలోన్) 1 శాతం తగ్గి రూ.2,021 కోట్లకు పడిపోగా, నికర అమ్మకాలు మాత్రం 5 శాతం వృద్ధితో రూ.15,793 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేర్ బీఎస్‌ఈలో 1.8 శాతం క్షీణించి రూ.797 వద్ద ముగిసింది.