ముంబైలో హంగ్ కార్పొరేషన్
బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు చిత్రంగా వచ్చాయి. ముందునుంచి ఆధిక్యంలో ఉన్న శివసేన... చివరి నిమిషంలో తడబడగా, జీజేపీ మాత్రం పుంజుకుంది. శివసేన - బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా నిలిచాయి. మొత్తం 227 స్థానాలున్న కార్పొరేషన్‌లో శివసేన 84, బీజేపీ 81, కాంగ్రెస్ 31, ఎన్సీపీ 9, ఎంఎన్ఎస్ 7, ఇతరులు 13 చోట్ల గెలిచారు. దాంతో అధికారం చేపట్టాలంటే కావల్సిన కనీస స్థానాలు.. 114 మ్యాజిక్ ఫిగర్ ఎవరికీ దక్కలేదు. ఇప్పటివరకు శివసేన - బీజేపీ కలిసి మహారాష్ట్రలో పోటీ చేయగా, ఇప్పుడు ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అయితే అత్యధిక స్థానాలను ఈ రెండు పార్టీలే పంచుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కేవలం 31 చోట్ల మాత్రమే గెలవగా, దాని మిత్రపక్షం ఎన్సీపీకి అంతకంటే దారుణంగా 9 వార్డులే దక్కాయి.
మరో రెండు స్థానాల్లో ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ రెండు స్థానాలు ఎవరికి దక్కినా కూడా అధికారం చేపట్టేందుకు తగినంత బలం ఉండదు. దాంతో.. ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన మళ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇతరులు గెలిచిన 13 స్థానాల్లో మూడు మజ్లిస్ పార్టీకి ఉన్నాయి. వాళ్లతో శివసేన పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు. ఇలాంటి పరిస్థితులలో మళ్లీ బీజేపీ - శివసేన కూటమి అధికారం చేపట్టవచ్చని భావిస్తున్నారు.