
పార్టీ మారే ప్రసక్తే లేదు
హైదరాబాద్ : తాను వైఎస్ఆర్ సీపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరామ్ ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో విలేకర్లతో కరణం బలరామ్ మాట్లాడుతూ... జీవితకాలం టీడీపీలోనే కొనసాగుతానన్నారు. కొంతమంది కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రకాశం జిల్లా టీడీపీలో కరణం బలరామ్ కీలకమైన పాత్ర పోషించారు. ఆ పార్టీ తరఫున ఆయన పలు మార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్న ఆయన.. తన కుమారుడిని బరిలో నిలిపారు. ఆయన కూడా ఓటమి పాలవ్వడం తెలిసిందే. దాంతో కరణం బలరామ్ సైలెంట్ అయిపోయారు. కానీ ఇటీవల ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.
ఆ ఎమ్మెల్సీ స్థానం కోసం కరణం బలరామ్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆ స్థానం మాత్రం కాంగ్రెస్కి రాజీనామా చేసి సైకిల్ ఎక్కిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని వరించింది. దీంతో కరణం మరింత సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్సీ కూడా దక్కకపోవడంతో కరణం టీడీపీపై ఆగ్రహంతో ఉన్నారని... ఈ నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో కరణం బలరామ్ శనివారంపై విధంగా స్పందించారు