
మోడీ నుంచి ఎంత తీసుకున్నారు?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో వివాదాస్పద మంత్రిగా పేరు తెచ్చుకున్న సోమనాథ్ భారతి.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నుంచి మీడియా డబ్బులు తీసుకుంటోందని ఆరోపించారు. ఇటీవల దక్షిణ ఢిల్లీలో అర్ధరాత్రి వేళ ఆఫ్రికా మహిళలపై మంత్రి తన అనుచరులతో కలసి దాడి చేశారంటూ ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమనాథ్ భారతి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని పలు డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ అంశంపై శనివారం కొందరు విలేకరులు ఆయన్ను పదేపదే ప్రశ్నించారు.
దీంతో సహనం కోల్పోయిన మంత్రి.. గుజరాత్ సీఎం మోడీ నుంచి ఎంత డబ్బు తీసుకున్నారంటూ విలేకరులపై విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా దుమారం రేగింది. కేజ్రీవాల్ కూడా సోమనాథ్‌ను తప్పుబడుతూ.. ఆయన వ్యాఖ్యలు సరికాదని స్పష్టంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఒకవేళ అవి ఎవరినైనా బాధించి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. కాగా, అర్ధరాత్రి దాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) సమన్లు జారీచేసినా సోమనాథ్ హాజరుకాకుండా, ఆ సమయంలో గాలిపటాల పండుగకు వెళ్లారు. ఈ అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. మహిళా కమిషన్ రాజకీయమయం అని ఆరోపించారు. డీసీడబ్ల్యూ చీఫ్ బర్ఖా సింగ్ కాంగ్రెస్ సభ్యురాలని, ఆమె ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత తన పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు.