
ఏమో ఆ కేసు గురించి తెలియదు
దాటవేసిన కేంద్ర మంత్రి జవదేకర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు అంశంలో ఏసీబీకి చిక్కిన మిత్రపక్ష టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయం గురించి తెలియదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్ చెప్పారు. ఢిల్లీలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న అనంతరం జవదేకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వ్యవహారంపై విలేకరులు ప్రశ్నించగా ‘ఆ విషయం నాకు తెలియదు’ అంటూ దాటవేశారు. అన్ని రాష్ట్రాలకూ న్యాయం చేస్తామని, ఏపీ, తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తొలుత మంత్రి జవదేకర్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
అనంతరం ఉత్సవాల ముగింపు సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కన పెట్టి, అందరితో కలసి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ శాంతియుతంగా అభివృద్ధివైపు పురోగమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ మీడియా కేంద్రం ప్రారంభం: తెలంగాణ భవన్‌లో తెలంగాణ సమాచార కేంద్రాన్ని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మీడియా కేంద్రం ద్వారా జాతికి తెలియజేయాలన్నారు.