నాకు మోదీ తెలుసు.. బెయిలివ్వండి | I know Prime minister, grant me bail, asks ex corporator | Sakshi
Sakshi News home page

నాకు మోదీ తెలుసు.. బెయిలివ్వండి

Published Wed, Mar 22 2017 2:36 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

నాకు మోదీ తెలుసు.. బెయిలివ్వండి - Sakshi

నాకు మోదీ తెలుసు.. బెయిలివ్వండి

తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాగా తెలుసని, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా తెలుసని, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వాలని ఓ మాజీ కార్పొరేటర్ కోరాడు.

మీమీద ఏదైనా కేసు నమోదైతే ఏం చేస్తారు.. పోలీసులు అరెస్టుచేయకుండా ఉండాలంటే ముందస్తు బెయిల్ తీసుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే.. వడోదరకు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ మాత్రం.. తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాగా తెలుసని, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా తెలుసని, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వాలని కోరాడు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను ప్రధాని, ముఖ్యమంత్రులతో గతంలో కలిసి తీయించుకున్న కొన్ని ఫొటోలను కూడా కోర్టుకు చూపించాడు. ఆయన పేరు హషిత్ తలాటీ. అయితే.. బెయిల్ ఇవ్వడానికి వాళ్లు తెలిసుంటే చాలదని భావించిన సిటీ సెషన్స్ కోర్టు జడ్జి.. అతడి బెయిల్ దరఖాస్తును తిరస్కరించారు. క్రైం సీఐడీ పోలీసులు ఇటీవల నమోదు చేసిన ఓ కేసులో తలాటీ ఉన్నారు.

వడోదరలోని గాయత్రీనగర్ సొసైటీకి సంబంధించి కోట్లాడి రూపాయల మేర జరిగిన ఫోర్జరీ కేసులో ఆయన హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. కేసు నమోదు కావడంతో అతడు పరారీలో ఉండి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు. తాను వ్యాపారవేత్తనని, చాలా సంవత్సరాల పాటు బీజేపీలో ఉన్నానని, బీజేపీ కార్పొరేటర్‌గా ఎన్నిక కావడంతో పాటు బీజేపీ అత్యున్నత నాయకులు కూడా తెలుసని, అందుకే బెయిల్ ఇవ్వాలని కోరాడు. అయితే తాము సవరించిన బెయిల్ దరఖాస్తును సమర్పించామని అతడి తరఫు న్యాయవాది కౌశిక్ భట్ తెలిపారు. నిందితుడు పారిపోడానికి ప్రయత్నించే వ్యక్తి కాదని నిరూపించేందుకే తాము కొన్ని ఫొటోలు చూపించినట్లు చెప్పారు. తలాటీ నిర్దోషి అని, అతడి పేరు ఎఫ్ఐఆర్‌లో కూడా లేకుండా నేరుగా చార్జిషీట్‌లో పెట్టారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement