అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరిగిన మూడురోజుల తర్వాత ఆ సమావేశం గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన ఆ సమావేశం హాల్లోకి తనను ఫోన్ తీసుకెళ్లనివ్వలేదని తాజాగా ఆయన ఆరోపించారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం దాదాపు పదేళ్ల తర్వాత ఈనెల 16న జరిగింది. కేవలం కొంతమంది ముఖ్యమంత్రులను మాత్రమే ఫోన్లు బయట పెట్టాలని చెప్పారని.. అందులో ప్రధానంగా తాను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నామని ఆయన తెలిపారు. తన రాష్ట్రంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తనకు ఎలా తెలుస్తుందని ఆమె గట్టిగా నిలదీయడంతో ఆమెను అనుమతించారు గానీ తనను మాత్రం అనుమతించలేదని కేజ్రీవాల్ చెప్పారు.
ఐఐటీ ఖరగ్పూర్లో తన బ్యాచ్మేట్ అయిన ఓ వ్యక్తి రాసిన ‘అరవింద్ కేజ్రీవాల్ అండ్ ద ఆమ్ ఆద్మీ పార్టీ - యాన్ ఇన్సైడ్ లుక్’ అనే పుస్తకం ఆవిష్కరణ సభలో ఆయనీ విషయాలు తెలిపారు. తాను మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు అడ్డుపడ్డారని, ప్రతిపక్షం మాట వినడానికి కూడా మీకు ఇష్టం లేకపోతే అసలు ఎందుకు పిలిచారని మండిపడ్డారు. తన ప్రభుత్వాన్ని కేంద్రం పనిచేయనివ్వడం లేదని ఆరోపించారు.
నన్ను ఫోన్ తీసుకెళ్లనివ్వలేదు: సీఎం
Published Wed, Jul 20 2016 11:13 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
Advertisement