ఫేస్బుక్ లో భత్కల్: పోలీసులు
న్యూఢిల్లీ: తీవ్రవాదులు పరస్పరం సందేశాలు పంపుకునేందుకు సామాజిక సంబంధాల వెబ్సైట్లు వినియోగిస్తున్నారా. అవుననే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) తీవ్రవాదులు - ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ఇతర ఇ-మెయిల్ చాటింగ్ వెబ్సైట్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారని కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ తాను అమలుచేయాలనున్న దాడులు గురించి ఇంటర్నెట్ ద్వారా సహచరులకు తెలిపేవాడని పోలీసులు పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు ఐఎం తీవ్రవాదులు నిమ్బజ్, యాహు, పాల్టాక్, జీమెయిల్, ఫేస్బుక్ ఐడీలు కలిగివున్నారని పోలీసులు గుర్తించారు. ఓ అక్రమ ఆయుధ కర్మాగారం ఏర్పాటు వెనుక కూడా వీరి ప్రమేయం ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.