
మహిళ నేతకు ఇమ్రాన్ అశ్లీల మెసేజ్‌లు!
వేధిస్తున్నారంటూ పార్టీ చీఫ్‌కు మహిళా నేత ఝలక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఆ పార్టీ మహిళ నేత ఎంఎన్‌ఏ ఆయేషా గులాలై రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యక్తిత్వం లేదని, ఆయన తనకు, పార్టీలోని ఇతర మహిళా నేతలకు అశ్లీల, అసభ్య సందేశాలు పంపేవారని ఆమె మండిపడ్డారు. పాక్ నూతన ప్రధానిగా అబ్బాస్సీ ప్రమాణం చేసిన సమయంలోనే ఆమె ఈ విధంగా పీటీఐకు గుడ్‌బై చెప్పారు.
వ్యక్తిత్వం, గౌరవమర్యాదలే తనకు ముఖ్యమని, ఆ విషయంలో రాజీపడలేకే పీటీఐకి రాజీనామా చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. 'పీటీఐలో మహిళా శ్రేణులకు గౌరవం లేదు. గౌరవప్రదమైన మహిళలెవరూ పార్టీలో పనిచేయలేరు' అని ఆమె అన్నారు. అయితే, ఆమె ఆరోపణలను పీటీఐ మహిళా నేత, చీఫ్ విప్ షిరీన్ మజారీ తోసిపుచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయేషాకు టికెట్ నిరాకరించడంతోనే ఆమె ఈ ఆరోపణలు చేశారని, పార్టీలోని మహిళలందరినీ ఇమ్రాన్‌ఖాన్ గౌరవిస్తారని ఆమె చెప్పారు.