ప్రభుత్వానికి పరీక్షాసమయం
ఈ వారంలో పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు
♦ రాజ్యసభకు జీఎస్‌టీ నివేదిక సమర్పించిన సెలక్ట్ కమిటీ
♦ రెండో వారమంతా పార్లమెంటు సమావేశాల్లో రచ్చ
♦ రాజ్యసభలో విపక్షాల రగడ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం
♦ విపక్ష పార్టీల నేతలతో బీజేపీ చర్చలు
న్యూఢిల్లీ: మొదటి వారంలో వివిధ అంశాలపై చర్చలవైపు సాగుతున్నట్లు అనిపించిన పార్లమెంటు.. రెండో వారంలో విపక్షాల ఆందోళనలతో మళ్లీ ‘వర్షాకాల సమావేశాల’ పరిస్థితిని తలపిస్తోంది. మరీ ముఖ్యంగా రాజ్యసభలో విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. కేంద్ర మంత్రి వీకే సింగ్‌ను మంతివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు నిరసనలు చేపట్టడం.. వెల్‌లోకి దూసుకు రావటంతో.. పరిస్థితి సర్దుకునేలా కనిపించటం లేదు. సభకు వీకే సింగ్ వచ్చినన్ని రోజులు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ తివారీ శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం ఆరు బిల్లులు లోక్‌సభ ముందుకు, ఏడు బిల్లులు రాజ్యసభ ముందుకు రానున్నాయి.
దేశాభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని కేంద్రం భావిస్తున్న ప్రతిష్ఠాత్మక వస్తుసేవల బిల్లు (జీఎస్‌టీ) కూడా రాజ్యసభ జాబితాలో ఉంది. లోక్‌సభ ఆమోదం పొందిన జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభలో మోక్షం లభించలేదు. లోక్‌సభ నుంచి పెద్దలసభకు వెళ్లిన ఈ బిల్లును విపక్షాల డిమాండ్‌కు అనుగుణంగా సెలక్ట్ కమిటీకి పంపించారు. దీనిపై సెలక్ట్ కమిటీ తన నివేదికను సమర్పించింది. కాగా, సోమవారం నుంచి చర్చించాల్సిన విషయాలపై.. రాజ్యసభ సభావ్యవహారాల సలహా కమిటీ జీఎస్‌టీ బిల్లుకు నాలుగు గంటలు, రియల్ ఎస్టేట్ బిల్లుకు రెండు గంటల సమయాన్ని కేటాయించింది. దీనిపై సభలో చర్చ జరగనుంది. అయితే.. జీఎస్‌టీ, రియల్ ఎస్టేట్ బిల్లులకు ఈ శీతాకాలపు సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదం లభించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది.
విపక్ష పార్టీల నేతలతో బీజేపీ ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నారు. కాగా, దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న కరవు పరిస్థితులపై సోమవారం లోక్‌సభలో.. నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులు, భారత్-నేపాల్ సంబంధాలపై రాజ్యసభలో స్వల్ప వ్యవధి చర్చ జరగనుంది. జీఎస్‌టీ బిల్లు దేశానికి చాలా అవసరం అంటూనే.. 18శాతం క్యాప్‌తోపాటు తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ సూచించింది. ప్రధానితో ‘చాయ్ పే చర్చ’లోనూ చర్చలు లేకుండా బిల్లును ఆమోదిస్తామనటంపై సోనియా గాంధీ హామీ ఇవ్వలేదని.. చర్చ జరిగాకే బిల్లు ముందుకు కదులుతుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత ఆనంద్ శర్మ తెలిపారు.
వీకే సింగ్‌పై గోబెల్స్ ప్రచారం ఆపండి!: బీజేపీ కేంద్ర మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యల వివాదంలో రాజ్యసభలో ఆందోళన చేస్తూ.. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. వీకే సింగ్ విషయంలో అసత్యాలతో కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని బీజేపీ దళిత నేత బిజయ్ సోన్‌కర్ శాస్త్రి విమర్శించారు. వీకే సింగ్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో తెలపాలని డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలోనే దళితులపై ఎక్కువ అన్యాయాలు జరిగాయని ఆరోపించారు. 2004-13 మధ్య కాంగ్రెస్ హయాంలోనే హరియాణాలో దళితులపై అత్యాచారాలు రెండున్నశాతం పెరిగినట్లు (మొత్తం కేసులు 3,198 కేసులు) వివరించారు. ఈ ఘటనలపై కనీసం విచారం వ్యక్తం చేసేందుకు కూడా సోనియా గాంధికి సమయం దొరకలేదా అని బిజయ్ ప్రశ్నించారు.