పన్నుఎగవేత సంస్థలపై కన్నెర్ర
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ పన్ను ఎగవేతలకు సంబంధించి జాబితాను విడుదల చేసింది. ‘నేమింగ్ అండ్ షేమింగ్’ విధానం కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలను శనివారం ప్రకటించింది. రూ. 448.02కోట్లు బకాయి పడిన 29 సంస్థల పేర్లను బహిర్గతం చేసింది. పదే పదే హెచ్చరించినా, అవకాశాలు ఇచ్చినా బకాయిలు చెల్లించని వారి జాబితాను ప్రముఖ జాతీయ దినపత్రికలకు ఐటీ శాఖ విడుదల చేసింది. ఆదాయం పన్ను మరియు కార్పొరేట్ పన్ను చెల్లించని వారి జాబితా ప్రకటనను జారీ చేసింది. పన్ను బకాయిలను తక్షణమే చెల్లించాల్సిందిగా కోరింది.
వ్యక్తిగత లేదా సంస్థల పేర్లు, పాన్ కార్డు, ఆఖరి చిరునామా, అంచనా పరిధి, బకాయి పడిన పన్ను మొత్తం వివరాలను ప్రకటించినట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ జాబితాలో ఉన్న పేర్లకు సంబంధించిన అసెస్సీలు ఎక్కడ ఉన్నా...తక్షణం పన్ను బకాయిలను చెల్లించాలని కోరారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉంచిన సమాచారం ప్రకారం వారి గురించి తెలిస్తే, సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అటు సీబీడీటీ వెబ్‌సైట్‌లో కూడా డిఫాల్టర్ల జాబితాను పోస్ట్ చేశారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఆదాయ పన్ను శాఖకు చెందిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) దీర్ఘకాలిక రుణాలు చెల్లించని వారి పేర్లను బహిరంగం ప్రకటించే వ్యూహాన్ని ఆరంభించింది. ఈ జాబితాను దాని అధికారిక వెబ్ సైట్ లో ఈ జాబితాను పోస్ట్ చేయడం కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.