
జీసీఐ ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన భారత్
2016-17 సంవత్సరానికి గాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ లో భారత్ 39 వ ర్యాంకును సాధించింది.
2016-17 సంవత్సరానికి గాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ లో భారత్ 39 వ ర్యాంకును సాధించింది. దీంతో ప్రపంచంలో మోస్ట్ కాంపిటీటివ్ 39 వ ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. రెండేళ్లలో మొత్తం 32 ర్యాంకులు ఎగబాకి ఈ ఘనతను సాధించింది. 138 ఆర్ధికవ్యవస్థలను పరిశీలించిన డబ్ల్యు ఈఎఫ్ జీసీఐ కాంపిటీటివ్నెస్ తాజా ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఈ జాబితాలో టాప్ ఆర్థిక వ్యవస్థగా స్విట్జర్లాండ్ అగ్ర భాగాన లిచింది. సింగపూర్ , అమెరికా రెండు, మూడవ స్థానాలు సాధించాయి. జర్మనీ తరువాత, నెదర్లాండ్స్ (5), స్వీడన్ (6) బ్రిటన్ (7), జపాన్ (8), హాంకాంగ్ (9), ఫిన్లాండ్ (10) నిలిచాయి.
ఆయా దేశాల 12 కేటగిరీల స్థాయి సమాచారంపై ఆధారపడి గ్లోబల్ కాంపిటీటివ్నెస్ సూచీ ర్యాంకింగ్ ను నిర్ణయిస్తారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక వాతావరణం, ఆరోగ్యం, ప్రాధమిక విద్య, ఆర్థిక మార్కెట్ అభివృద్ధి, టెక్నలాజికల్ సంసిద్ధత, మార్కెట్ పరిమాణం, బిజినెస్ సోఫిస్టికేషన్, ఇన్నోవేషన్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఏడాది 138 ఆర్థిక వ్యవస్థలను పరిశీలించగా, గత ఏడాది (2015-16)వీటి సంఖ్య 140 గా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో తగ్గుతున్న నిజాయితీ కాంపిటీటివ్నెస్ కు నష్టం చేకూరుస్తోందని, సంఘటిత వృద్ధిని సాధించడంలో ఆయా నేతలకు కష్టంగా ఉంటోందని డబ్ల్యు ఈఎఫ్ స్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ క్లాస్ స్చావాబ్ చెప్పారు.
గత ఏడాది 55 వ స్థానంలో ఉన్న ఇండియా 16 స్థానాలు జంప్ చేసింది. అలాగే బ్రిక్స్ దేశాల్లో 28వ ర్యాంకు తో రెండవ పోటీదారుగా నిలిచింది. వరుసగా రెండో ఏడాది కూడా 16 పాయింట్లు ఎగబాకడం విశేషమని మార్కెట్ల వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశంలో విభిన్న ఆర్థిక సంస్కరణలతో ముందుకు వస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద బూస్ట్ అని వ్యాఖ్యానించాయి.