దేశాల మధ్య అంతర్జాతీయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించే గ్లోబల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం యోచిస్తోందని లా అండ్ జస్టిస్, ఐటీ శాఖామంత్రి రవి శంకర ప్రసాద్ తెలిపారు.
న్యూడిల్లీ: దేశాల మధ్య అంతర్జాతీయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించే గ్లోబల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం యోచిస్తోందని లా అండ్ జస్టిస్, ఐటీ శాఖామంత్రి రవి శంకర ప్రసాద్ తెలిపారు. తాము దేశానికి పెట్టుబడులు ఆహ్వానిస్తూనే, శ్రీఘ్రంగా వివాదాలను పరిష్కరించే వ్యవస్థమీద దృష్టిపెట్టినట్టు ఆయన చెప్పారు. భారతదేశ పెట్టుబడిదారులకు ఒక సాహసోపేతమైన వివాద పరిష్కార వ్యవస్థను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రపంచ మధ్యవర్తిత్వ కేంద్రంగా మారే లక్ష్యంతో ఉన్నామని బ్రిక్స్ దేశాల ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అంశంపై నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి చెప్పారు. ముంబై, ఢిల్లీ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో రవి శంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
వ్యాపార వృద్ధి ఉంటే, వివాదాలు పెరుగుతాయని, ఈ నేపథ్యంలో ఒక బలమైన మధ్యవర్తిత్వ ఫోరమ్ ఉండాల్సి అవసరం ఉందని ప్రసాద్ వివరించారు. దేశంలో ఉత్తమ న్యాయమూర్తులున్పప్పటికీ, వారు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సందర్భాలలో వారికి ప్రాతినిధ్యం లభించడంలేదని తెలిపారు. ఐదుగురు సభ్యుల బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా , దక్షిణ ఆఫ్రికా మధ్య బలమైన మధ్యవర్తిత్వ ఫోరం కోసం ఒక అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఐదు బ్రిక్స్ దేశాల మధ్య 2015 లో 242 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది.