
ప్రస్తుతం వీలుకాదు
దావోస్: బంగారం దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్‌పై చర్య తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరగా, ఇప్పట్లో అలాంటి ఆలోచనేదీ లేదని ప్రభుత్వం పేర్కొంది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనీ, పసిడి దిగుమతులను ఎగుమతులతో ముడిపెడుతున్న నిబంధనను సవరించాలన్న ఆభరణాల ఎగుమతిదారుల విజ్ఞప్తిని పరిశీలించాలని సోనియా గురువారం కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశారు. అయితే, కరెంటు అకౌంట్ లోటు(క్యాడ్)పై గట్టి పట్టు సాధించిన తర్వాతే బంగారం దిగుమతులపై ఆంక్షలను ఉపసంహరించుకోగలమని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తేల్చిచెప్పారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సదస్సులో మంత్రి ప్రసంగించారు. పుత్తడి దిగుమతులపై ఆంక్షలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు.
8 శాతం వృద్ధి రేటును మళ్లీ అందుకుంటాం...
సంస్కరణలు, సత్వర నిర్ణయాలు సత్ఫలితాలిచ్చాయని చిదంబరం అన్నారు. పాత తప్పిదాలు పునరావృతం కాకుంటే భారత్ 8% వృద్ధి రేటును మళ్లీ అందుకుంటుందని ఉద్ఘాటించారు. డబ్ల్యుఈఎఫ్ సదస్సులో భాగంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘మేం మరింత నిర్ణయాత్మకంగా ఉండాలని ఏడాదిన్నర క్రితం నిర్ణయించాం. ఆ ఫలితాలు ఇపుడు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో క్రమంగా 8% వృద్ధిరేటును మళ్లీ చేరుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదు..’ అని చిదంబరం ధీమా వ్యక్తంచేశారు.
ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాదు...
ఇండియాతో పాటే దక్షిణాఫ్రికాలోనూ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా, ‘దక్షిణాఫ్రికా పరిస్థితి సంతోషకరం. అక్కడి పాలక పక్షం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. కానీ భారత్‌లో పరిస్థితి అలా లేదు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం కన్పించడం లేదు’అన్నారు.
10 కోట్ల ఉద్యోగాల కల్పన: ఆనంద్ శర్మ
తయారీ రంగంలో 10 కోట్ల మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించాలని భారత్ యోచిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంతి ఆనంద్ శర్మ తెలిపారు. జీడీపీలో ప్రస్తుతం 16%గా ఉన్న తయారీరంగం వాటాను 25%కు పెంచడం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. దావోస్‌లో తయారీరంగంపై నిర్వహించిన సెషన్లో ఆయన ప్రసంగించారు.
ఇదీ 80:20 నిబంధన
పసిడి దిగుమతులపై ఆంక్షలను, 80:20 దిగుమతుల నిబంధనను సడలించాలని వజ్రాలు, ఆభరణాల పరిశ్రమ చేస్తున్న డిమాండుపై తగిన చర్య తీసుకోవాలంటూ వాణిజ్య శాఖకు సోనియా గురువారం లేఖ రాశారు. బంగారం దిగుమతిపై 10%గా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 2%కు తగ్గించాలని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వ్యాపార సమాఖ్య సోనియాకు రాసిన లేఖలో కోరింది. 80:20 నిబంధనను సవరించాలని విజ్ఞప్తి చేసిం ది. 80:20 నిబంధన ప్రకారం అంతకుముందు దిగుమతి చేసుకున్న పసిడిలో 20%ను ఎగమతి చేసే వరకూ కొత్త దిగుమతులను అనుమతించరు.