దేశంలో కుబేరులకు కొదువ లేదు!
దేశంలో కుబేరులకు కొదువలేదని తాజాగా ఓ అంతర్జాతీయ అధ్యయన సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం 50 మిలియన్ డాలర్ల (రూ.324 కోట్లకు పైచిలుకు) నికర సంపద కలిగిన కుబేరులు దేశంలో 2,080 మంది ఉన్నారు. రానున్న ఐదేళ్లలో డాలర్ మిలియనీర్ల సంఖ్య అమాంతం 3,05,000లకు చేరుకోనుంది. ఒక్క అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో మినహాయిస్తే 2000 సంవత్సరం నుంచి దేశీయంగా సంపద పెరుగుతూనే ఉందని క్రెడిట్ సూయిసె గ్లోబల్ వెల్త్ నివేదిక తెలిపింది.
" భారత్లో ప్రస్తుతం 50 మిలియన్ డాలర్ల కన్నా అధిక నికర సంపద కలిగిన సంపన్నులు (అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిజువల్స్) 2,083 మంది ఉన్నారు. 2014తో పోల్చుకుంటే వీరి సంఖ్య మూడుశాతం పెరిగింది. 2,54,000 మంది అంతర్జాతీయ సంపన్నదారులలో వీరి వాటా ఒక శాతం' అని పేర్కొంది. భారత్లో 2,080 మంది 50 మిలియన్ డాలర్ సంపద కలిగిన వ్యక్తులు, 940 మంది 100 మిలియన్ డాలర్ సంపద కలిగిన వ్యక్తులు ఉన్నారని వివరించింది.