సమస్యలు తీర్చే బడ్జెట్‌ కావాలి | india needs a budget which solve economical issues | Sakshi
Sakshi News home page

సమస్యలు తీర్చే బడ్జెట్‌ కావాలి

Published Tue, Jan 31 2017 3:44 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

సమస్యలు తీర్చే బడ్జెట్‌ కావాలి

సమస్యలు తీర్చే బడ్జెట్‌ కావాలి

సంప్రదాయానికి విరుద్ధంగా తొలిసారి బడ్జెట్‌ ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నారు.  ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వచ్చే ఈ ఏడాది బడ్జెట్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలను గత ఏడాది సెప్టెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం వేగంగా దాన్ని అమల్లోకి తెచ్చేందుకు వీలుగానే సంప్రదాయానికి భిన్నంగా ఫిబ్రవరి ప్రారంభంలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు విమర్శలు వచ్చాయి. ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనుండటం, బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కొద్ది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికలు ఉండటంతో వాటిని ప్రభావితం చేసేందుకే ఎన్డీయే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

ఒకనొక సందర్భంలో 2012 సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మాదిరిగా మార్చి11(ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవుతాయి) తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ వినిపించింది. అంతలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను ప్రభావితం చేసే విధంగా బడ్జెట్‌ కేటాయింపులు ఉండకూడదని చెబుతూ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ ను ప్రవేశపెట్టేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయం సమంజసమేనా?. ఒక దేశానికి బడ్జెట్‌ను ప్రవేశపెడుతన్నప్పుడూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు దేశంలో భాగం కావా?. బడ్జెట్‌ కేటాయింపులు ఆ ఐదు రాష్ట్రాలకూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఓటర్లు ప్రభావితం కాకుండా ఎలా ఉంటారు?.

దేశంలో ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో స్ధానిక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అలాగని దేశ భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్‌ లాంటి కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం కూడా మంచిది కాదు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్నికల కమిషన్‌(ఈసీ) కట్టుదిట్టమైన నిబంధనలను తయారు చేయాల్సివుంది. 2017- 2018 ఆర్థిక సంవత్సరానికి బుధవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఏయే అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తే లాభం కలుగుతుందో చూద్దాం.

నోట్ల రద్దు
పెద్ద నోట్ల రద్దు అనంతరం పూట గడవడం కోసం రోజూ కూలీకి వెళ్లే వారు కూడా పనులు మానుకుని బ్యాంకుల ముందు క్యూలలో నిల్చున్నారు. వీరిలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులు, మధ్య తరగతి వారు, చిన్న వ్యాపారులు ఉన్నారు. ఈ బడ్జెట్‌ ద్వారా వీరందరికి ఆర్ధిక సాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే బావుంటుంది.

వ్యవసాయ రంగం
బడ్జెట్‌ లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత రెండేళ్లుగా వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండేళ్లలో వ్యవసాయ రంగ అభివృద్ధి రెండు శాతాని కంటే దిగువకు పడిపోయింది. 2022కల్లా వ్యవసాయ రంగంలో అభివృద్ధిని నాలుగు శాతానికి చేరుస్తామని బీజేపీ ప్రభుత్వం 2016-2017 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ చెప్పింది. నేషనల్‌ సర్వీసు స్కీంలో ఉన్న వివరాల ప్రకారం.. ఓ రైతు పంటను పండించడానికి సగటున రూ.20వేలు పెట్టుబడి పెడుతున్నాడు. సదరు పంట మీద అతనికి రూ.40 వేలు వస్తే.. ఏడాది పాటు పడిన రెక్కల కష్టానికి నెలకు రూ.3,500 కంటే తక్కువ వస్తుంది. అది కూడా తాను పండించిన పంటకు మార్కెట్లో ధర బావుంటేనే.

ప్రస్తుతం దేశంలో ఉన్న 50శాతం మంది రైతులకు కనీసం రూ.47వేల అప్పులు ఉన్నాయి. ప్రభుత్వం వూరికే రైతులకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించడం కాకుండా ఆ స్దానంలో మరేదైనా ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రస్తావించుకోదగిన మరో అంశం రైతుల ఆత్మహత్యలు గత రెండేళ్లుగా దేశంలో రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం గత ఏడాది జరిగిన ఆత్మహత్యల్లో అత్యధికంగా 11 శాతం మంది రైతులు బలవతంగా ప్రాణాలు తీసుకున్నారు. రైతు ఆత్మహత్య గురించి సుప్రీం కోర్టులో ఓ ఎన్‌జీఓ పిటిషన్‌ను దాఖలు చేయగా దాన్ని అత్యున్నత న్యాయస్ధానం పిల్‌గా మలిచి విచారణకు స్వీకరించింది.

రైతులకు లోన్లు ఇస్తున్నామని చేతులు దులుపుకోకుండా ప్రభుత్వాలు వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని అందుకోసం ఓ జాతీయ పాలసీని తీసుకురావాలని పేర్కొంది. ఎన్‌పీఏలు బ్యాంకులను ఓ వైపు వేధిస్తున్నా గత ఏడాది వ్యవసాయ బడ్జెట్‌ రైతులకు లోన్లు ఇప్పించే దిశగానే సాగింది. కేవలం లోన్లకే పరిమితంగా కాకుండా నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, రైతులకు పంటలపై అవగాహన కల్పించడం, ఇరిగేషన్‌ తదితరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దురదృష్టవశాత్తు గతేడాది వ్యవసాయబడ్జెట్‌ 2005లో ఇచ్చిన బడ్జెట్‌ కన్నా తక్కువ కేటాయింపులకే పరిమితమైంది. వ్యవసాయ రంగంలో ఒక శాతం అభివృద్ధి జరిగితే జీడీపీ అందుకు రెండింతలు పెరుగుతుందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో నాలుగు శాతం వృద్ధి రేటు అనే ప్రభుత్వ కల సాకారం కావాలంటే అన్ని రంగాల కంటే ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరగాలి.

కొలువులు సృష్టించగలగాలి
2017-2018 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌ దేశ యువతకు తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే అవకాశాన్ని ఇవ్వగలగాలి. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఎగుమతులు, తయారీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గినట్లు చెబుతున్నాయి. భారతదేశానికి ఉన్న సమున్నత శక్తి యువత. వారికి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలి. అందుకు తగిన విధంగా బడ్జెట్‌ కేటాయింపులు ఉంటే బావుంటుంది.

వ్యాపారం
దేశంలో సులువుగా వ్యాపారం చేయడానికి అనుగుణంగా పన్నులకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యాపార రంగం భారత్‌లో విస్తృతం అవుతుంది. పారదర్శకత పెంచడం, వ్యాపార ప్రతిపాదనలకు సులువైన రీతిలో ఆమోదం తెలపడం వంటి వాటిపై ఈ బడ్జెట్‌లో ప్రకటన చేయడం వల్ల లాభం ఉంటుంది.

రాష్ట్రాల అభివృద్ధి
దేశంలో ఐదారు రాష్ట్రాలే ఆర్ధికంగా పరిపుష్టంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోకే 90శాతానికి పైగా పెట్టుబడులు వెళుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అభివృద్ధిలో వెనుక ఉన్న రాష్ట్రాలు అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలకు అందించే నిధుల్లో కొన్నింటికి కేంద్రం కోత విధించింది. కేవలం కొన్ని రాష్ట్రాల అభివృద్ధి ద్వారా మాత్రమే దేశాభివృద్ధి సాధ్యం కాదు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ద్వారా నిధులు అందుతున్నాయి. కానీ, మరికొన్ని రాష్ట్రాలు పుంజుకోవడానికి కేంద్రం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు అవసరం.

ఇప్పటివరకూ ప్రస్తావించుకుంది కొన్ని ప్రాంతాలే అయినా బడ్జెట్‌ కేటాయింపుల్లో వీటికి ప్రాధాన్యం కల్పిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరగా పరిష్కారాలు చూపే ఆస్కారం ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement