రక్షణ శాఖకు చెప్పకుండా నేవీ ఏం చేసిందో తెలుసా?
రక్షణ శాఖ అనుమతి లేకుండా భారతీయ నౌకాదళం కీలక పోస్టులను భర్తీ చేసింది. దీంతో ఈ విషయంపై రక్షణ శాఖ గుర్రుగా ఉంది. తమకు చెప్పకుండా అప్పటికప్పుడు కీలక స్ధానాల్లో అధికారులను నియమించడానికి సంబంధించిన విషయం.. రక్షణ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ ఒకరు నేవీ సంబంధించిన ఫైళ్లను తిరగేస్తున్న సమయంలో వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
ఢిల్లీ అడ్మిరల్ అధికారి కిషేన్ కుమార్ పాండేను ఫోడా(ఎఫ్‌ఓడీఏ)గా నేవీ నియమించింది. అయితే, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తులు లేని నేవీ.. కొత్తగా నేవీకు సంబంధించిన ఆస్తుల నిర్మాణం కోసమే అధికారిని నియమించడానికి కారణంగా తెలుస్తోంది. అధికారులకు కొత్త పోస్టింగులు ఇచ్చే సమయంలో బడ్జెట్ కు సంబంధించిన అంశాలు మిళితమై ఉండే కారణంగా సాయుధ దళాలు సదరు పోస్టింగులకు సంబంధించి రక్షణ శాఖ వద్ద అనుమతి తీసుకోవాల్సివుంటుంది.
త్వరలో దేశ రాజధానిలో ఏర్పాటు చేయనున్న నౌ సేనా భవన్ కు ఫోడా అవసరం ఉన్న కారణంగా నేవీ నియమకాన్ని చేపట్టినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నేవీ అధికారి చెప్పారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే కొత్తగా రెండు కార్యాలయాల ఏర్పాటుకు నేవీ పూనుకోవడంపై రక్షణ శాఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇందుకు వివరణ ఇవ్వాలని నేవీని కోరుతామని వెల్లడించింది.