
నేరం ఒప్పుకున్న ఇంద్రాణి!
ముంబై: కూతురు హత్య కేసులో అరెస్టైన ఇంద్రాణి ముఖర్జియా పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ హత్యలో తన పాత్ర ఉన్నట్టు ఆమె అంగీకరించారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల పాటు పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చిన ఆమె ఎట్టకేలకు నేరం ఒప్పుకున్నట్టు తెలిపాయి.
తన కూతురు షీనా బోరా హత్యకు గురికాలేదని, బతికేవుందని ఇంద్రాణి చెప్పింది. షీనా అమెరికాలో ఉంటోందని, తనపై ద్వేషంతో నే ఆమె బయటకు రావడం లేదని ఇంద్రాణి నమ్మబలికింది. ఆమె చెప్పిన దాంట్లో పరస్పర విరుద్ధ విషయాలు ఉన్నాయని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. షీనా హత్య కేసులో అరెస్టైన ముగ్గురు నిందితుల పాత్రపై ఆరా తీస్తున్నామని చెప్పారు.
మిగతా ఇద్దరు నిందితులు నేరం ఒప్పుకున్నారని అనుకుని ఆమె కూడా నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాంద్రా కోర్టులో తన చిన్న కూతురు విధిని కలిసినప్పుడు ఇంద్రాణి కన్నీళ్లు పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.