టీసీఎస్ బాటలో ఇన్ఫోసిస్
బెంగళూరు: ఇటీవల నిరాశాజనక ఫలితాలతో డీలా పడ్డ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థను మళ్లీ లాభాల బాటలో తీసుకెళ్లేందుకు సీఈవో విశాల్ సిక్కా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తన ప్రధాన పత్యర్థి, మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ బాటలో నడుస్తున్నారు. టీసీఎస్ ఏడు సంవత్సరాల క్రితం అమల్లోకి తెచ్చిన ప్రక్రియను ఇన్ఫోసిస్ అవలంబించబోతోంది. తన వ్యాపారాన్ని చిన్న యూనిట్లుగా విస్తరించనున్నామనే ఎత్తుగడను ప్రకటించింది ప్రాఫిట్ అండ్ లాస్ (పీఎన్ఎల్) బాధ్యతలను విడదీస్తున్నట్టు తెలిపింది.
పూనే సమావేశంలో విశ్లేషకుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన విశాల్ సిక్కా ఈ మేరకు వివరణ ఇచ్చారు. వ్యాపార విభజనలో భాగంగా స్వయంప్రతిపత్తిగల యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది తమకు వ్యాప్తిని ఇస్తుందనీ, ఆయా వ్యక్తుల జవాబుదారీతనం ఇస్తుందని చెప్పారు. చిన్నచిన్న యూనిట్లుగా విభజించామని చెప్పినప్పటికీ సంఖ్యను పేర్కొనలేదు. అలాగే తరువాతితరం నాయకత్వం వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది.
ఎన్ చంద్రశేఖరన్ టీసీఎస్ సీఈవో ఉన్నప్పుడు దాదాపు ఏడు సంవత్సరాల క్రితం 2009లో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 23 మంది మినీ సీఈవో లకు బాధ్యలను అప్పగించి, వ్యాపార వృద్ధిలో టార్గెట్స్ ఇ చ్చింది. అయితే ప్రస్తుతమున్న వ్యాపారంలో అంతరాయం రాకుండా చిన్న చిన్న యూనిట్లను అనుమతినివ్వడమనే నూతన ప్రక్రియ ఇన్ఫోసిస్ వ్యాపార వృద్ధికి తోడ్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
కాగా సంస్థలో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదనీ, ఇన్ఫోసిస్ లో అట్రిషన్ ను తగ్గించేందుకు తామెన్నో చర్యలు తీసుకున్నామని, ప్రతిభావంతులైన ఉద్యోగులను గుర్తించి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నామని కూడా విశాల్ సిక్కా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.