
మీదేం మర్యాద.. ఏం వైఖరి?
టీడీపీ నేతలను నిలదీసిన సుష్మాస్వరాజ్
అపాయింట్‌మెంట్ లేకుండా రాజ్‌నాథ్‌ను కలవడం ఏం మర్యాద
‘టీ’పై రెండు వాదాలు చెబుతున్నారంటూ నామాపై మండిపాటు
సుష్మా వ్యాఖ్యలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడిన టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం ఓవైపు టీడీపీ నేత చంద్రబాబు ఉవ్విళ్లూరుతుంటే.. మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ మాత్రం చంద్రబాబు వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ అధినేత రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసే విషయంలో చంద్రబాబు అమర్యాదగా వ్యవహరించారని, కనీసం అపాయింట్‌మెంట్ కూడా తీసుకోకుండా నేరుగా వచ్చి భేటీ కావడమేమిటని ఆమె తీవ్రంగా తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై రెండ్రోజుల కిందట తనను కలవడానికి వచ్చిన తెలంగాణ టీడీపీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావును ఆమె కడిగిపారేసినట్లుగా తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. రాష్ట్ర విభజన విషయమై చంద్రబాబు ఈ నెల 3న రాజ్‌నాథ్‌ను కలిశారు. ఈ భేటీ తర్వాత మూడు, నాలుగు రోజుల అనంతరం నామా నేతృత్వంలో కొందరు తెలంగాణ టీడీపీ నేతలు సుష్మాస్వరాజ్‌ను పార్లమెంట్‌లోని కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా టీడీపీ తీరును సుష్మా ప్రస్తావిస్తూ ‘‘మా అధ్యక్షుడు అనారోగ్యంతో ఉంటే మీరు అపాయింట్‌మెంట్ తీసుకోకుండా ఆయన నివాసంలోకి వెళ్లడం ఏం మర్యాద? ఇది సరైన సంప్రదాయమేనా? మీరు ఏం చేసినా చూస్తూ కూర్చోవాలా?’’ అని మండిపడ్డారు. అలాగే విభజన విషయంలో టీడీపీ భిన్న వైఖరులపైనా ఆమె ఘాటుగానే స్పందించారు. ‘‘మొన్న మీరే ఒక బృందంతో వచ్చి సమైక్యాంధ్ర కావాలన్నారు. ఇప్పుడు మళ్లీ వచ్చి రాష్ట్ర విభజన చేయాలంటున్నారు. అసలు మీ(టీడీపీ) వైఖరేంటీ?’’ అని ప్రశ్నించడంతో నామా సహా నేతలు మిన్నకుండిపోయారు. ‘‘ఆర్టికల్, రాజ్యాంగం అని మీరు బ్లూబుక్ ఇస్తున్నారు. రాజ్యాంగం మా వద్ద లేదా? మాకు ఆర్టికల్స్ తెలియదా?’’ అని సుష్మా నిలదీశారు. దీంతో చేసేదిలేక టీడీపీ నేతలు.. ‘‘బాబు ఎంత ఇరకాటంలో పెట్టారు.. ఆయన వైఖరి మనకు చేటు తెస్తోంది’’ అని అనుకుంటూ నిష్ర్కమించారు. సుష్మా వ్యాఖ్యలను బయటకు పొక్కనీయవద్దని నామా సూచించినప్పటికీ బాబు వైఖరితో అసంతృప్తిగా ఉన్న ఒకరిద్దరు నేతలు లీక్ చేయడంతో సుష్మా వద్ద పరాభవం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.