పునరుత్పాదక విద్యుత్‌కు చేయూతనివ్వాలి | interview with tata power MD anil sardhana | Sakshi
Sakshi News home page

పునరుత్పాదక విద్యుత్‌కు చేయూతనివ్వాలి

Published Thu, Dec 26 2013 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

పునరుత్పాదక విద్యుత్‌కు చేయూతనివ్వాలి

పునరుత్పాదక విద్యుత్‌కు చేయూతనివ్వాలి

 ‘సాక్షి’ ఇంటర్వ్యూ   టాటా పవర్ ఎండీ అనిల్ సర్దానా..
 
   చౌక టెక్నాలజీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అవసరం...
   ఈ వ్యవస్థ పటిష్టం కావడం ఆర్థిక వృద్ధికి కీలకం..
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
 2020 నాటికి 26వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని ప్రైవేట్ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ నిర్దేశించుకుంది. ఇందులో నాలుగోవంతు వాటా పునరుత్పాదక విద్యుత్‌ది ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సంప్రదాయేతర విద్యుదుత్పత్తి విభాగం పనితీరు, ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి విషయాల గురించి టాటా పవర్ ఎండీ అనిల్ సర్దానా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే...
 
 జోరుగా స్థల సమీకరణ
 టాటా పవర్‌లో భాగమైన సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక విభాగం సామర్థ్యం ప్రస్తుతం 1,106 మెగావాట్లుగా ఉంది. 2020 నాటికల్లా టాటా పవర్ 26,000 మె.వా. విద్యుదుత్పాదన సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా... అందులో సుమారు 20-25 శాతం కాలుష్యరహితమైన సంప్రదాయేతర వనరుల ద్వారా ఉండాలని నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం పవన విద్యుత్‌కి సంబంధించి 398 మె.వా. సామర్థ్యం ఉంది. మరో 160 మె.వా. ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఇక సౌర విద్యుత్‌కి సంబంధించి 28 మె.వా. పైగా సామర్థ్యం ఉంది. మరిన్ని ప్రాజెక్టులను చేపట్టే దిశగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో స్థల సమీకరణ ప్రక్రియ జరుగుతోంది. విద్యుదుత్పత్తి విధానాన్ని బట్టి భౌగోళికంగా పరిస్థితులు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటున్నాం.
 
 రెండింటికీ ప్రాధాన్యం..
 సౌర, పవన విద్యుత్.. రెండింటికీ ప్రాధాన్యం ఇస్తున్నాం. అయితే, దేశీయంగా పవన విద్యుత్ రంగ విధానాలు గడిచిన ఇరవై ఏళ్లుగా అభివృద్ధి చెందాయి. కానీ, సౌర విద్యుత్ రంగం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి స్థాయిలో రూపొందాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే.. మొత్తం మీద ఏటా 150-200 మె.వా. మేర పవన విద్యుత్, 30-50 మె.వా. మేర సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్నాం.
 
 ఇతర దేశాల్లో విస్తరణ..
 అంతర్జాతీయంగా నాలుగు కీలక ప్రాంతాలను ఎంచుకున్నాం. ఇందులో ఆఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, సార్క్ దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో మార్కెట్ పరిస్థితులను, అవకాశాలను అధ్యయనం చేస్తున్నాం. దక్షిణాఫ్రికా, ఇండొనేషియా వంటి దేశాల్లో ఇతర కంపెనీలతో కలిసి ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టాం. అవకాశాలు, రిస్కులు, రివార్డులు మొదలైన అంశాల ప్రాతిపదిక గా ఆయా దేశాలను ఎంచుకుంటున్నాం.
 
 సంప్రదాయేతర విద్యుదుత్పత్తికి సవాళ్లు..
 ఈ రంగం ప్రధానంగా కొనుగోలుదారులపరమైన సమస్య ఎదుర్కొంటోంది. చాలా మటుకు పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. దీంతో అవి కొనుక్కునే విద్యుత్ చెల్లింపుల్లో జాప్యాలు జరుగుతున్నాయి. మరోవైపు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ రకాల విధానాలు పాటిస్తుండటం వల్ల ఇలాంటి ప్రాజెక్టులు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. స్థల సమీకరణలో జాప్యం, అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం, పునరావాస కల్పన లాంటివి వీటికి తోడవుతున్నాయి. ఇక పవన విద్యుత్‌కి అనువైన పరిస్థితులు ఉన్న కొన్ని రాష్ట్రాలు.. ఇప్పటికే తమకు సరిపడేంత విద్యుత్ ఉండటంతో కొత్తగా మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఇందుకు టారిఫ్‌లను తగ్గించేయడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం వంటి మార్గాలు ఎంచుకుంటున్నాయి. పంపిణీ సంస్థలు తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలన్న నిబంధనను అమలు చేయకపోవడం వల్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ నిర్వీర్యమవుతోంది.
 
 ప్రభుత్వ సహకారం కావాలి..
 ఎకానమీ వృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యుత్ రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రంగం ఎదగడానికి అడ్డుగా ఉంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. అలాగే ప్రభుత్వం విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యాపారాల్లో డిజిన్వెస్ట్ చేసి, పెట్టుబడులు రావడానికి ఊతమివ్వాలి. ప్రైవేట్ సంస్థలు ప్రజల అవసరాలకు తగిన విధంగా స్పందించేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యుదుత్పత్తి పరిమాణంలోనే కాకుండా నాణ్యతలో కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం గట్టిగా తల్చుకుంటే ఇది సాధ్యమే. పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు(ఆర్‌పీవో) వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తే ఈ రంగానికి గట్టి ఊతం లభిస్తుంది. పునరుత్పాదక వనరులు దేశవ్యాప్తంగా ఒకే స్థాయిలో ఉండవు కనుక అవి పుష్కలంగా ఉన్న చోట్లలో భారీఎత్తున ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఆర్‌పీవోల వల్ల భరోసా కలుగుతుంది. ఇక, సౌర విద్యుదుత్పత్తికి ఉపయోగించే టెక్నాలజీపైనా (సీఎస్‌టీ లేదా పీవీ) ఆంక్షలు పెట్టకుండా దాన్ని డెవలపర్లకే విడిచిపెట్టాలి. విద్యుదుత్పత్తి వ్యయాలను తగ్గించే టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహమివ్వాలి.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement