ఐఫోన్ ధరలకు మళ్లీ రెక్కలు
భారత్లో ఐఫోన్ ధరలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయట. గరిష్ట రిటైల్ ధరకు(ఎంఆర్పీకి) చేరువలో ఐఫోన్ ధరలను కొనసాగించాలని రిటైలర్లను యాపిల్ ఆదేశిస్తున్న నేపథ్యంలో ఐఫోన్ ధరలు మళ్లీ పెరుగుతాయని ఫోన్ ర్యాడర్ రిపోర్టు పేర్కొంటోంది. ఆగస్టు 1 నుంచి ఐఫోన్ ధరలు భారత్లో పెరగొచ్చంటూ ఈ రిపోర్టు వెల్లడించింది. అయితే ఈ ధరలు పెరుగుదల నిజానికి ధరలు పెంపు కాదని, ఎంఆర్పీ ధరలను అమలుచేయాలని యాపిల్ భావిస్తుండటంతో, ఈ ధరలు ఎంఆర్పీకి చేరువ కాబోతున్నాయని తెలిపింది. భారత్లో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఐఫోన్లు ఆవిష్కరించిన కొన్ని నెలలకే ఆ ఫోన్లపై డిస్కౌంట్లను రిటైలర్లు ఆఫర్ చేశారు.దీంతో ఎంఆర్పీ ధరలకంటే తక్కువ స్థాయిలో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఐఫోన్ ధరలను ఎంఆర్పీకి చేరువ చేయాలని యాపిల్ ఆదేశిస్తుండటంతో, రిటైలర్లు ఈ ధరలను పెంచుతున్నారని తెలుస్తోంది. గత ఏప్రిల్ లో కూడా రిటైలర్లు ఐఫోన్ ధరలను 29శాతం పెంచారు.
ఫ్లిప్ కార్ట్లో ప్రస్తుతం రూ.46,499గా ఉన్న ఐఫోన్ 6ఎస్ 16జీబీ ధర, రాబోయే రోజుల్లో ఎంఆర్పీ ధర రూ.62,000లకు ఆ ఫోన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అదేవిధంగా ఐఫోన్ 6ఎస్ ప్లస్ ధరలు పెరుగుతాయని రిపోర్టు పేర్కొంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ 16జీబీ వెర్షెన్ ధర ప్రస్తుతం రూ.48,499గా ఉంది. అయితే పెరగబోయే ధరలు రూ.72,000లకు చేరుతాయని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఐఫోన్ 5ఎస్ ఒక్క ఫోన్కే ధరల పెంపుకు సంబంధించి యాపిల్ నుంచి అధికారికంగా ఆదేశాలు వెలువడ్డాయి. గతంలో ఈ ఫోన్ 20వేలకు అందుబాటులో ఉండేది. పెరిగిన ధరలతో ప్రస్తుతం 23వేలగా ఉంది. ఈ ఫోన్ ధరలను మరో రెండు వేల పెంపుతో 25వేల రూపాయలకు అమ్మాలని రిటైలర్లను యాపిల్ ఆదేశించినట్టు ఈ రిపోర్టు వెల్లడించింది.