
అసాధ్యం కాదా? ట్రంప్ గెలవొచ్చా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధ పీఠాన్ని అధిష్టించే అవకాశాలు ఉన్నాయా?. ఎన్నికల తేదీ చేరువవుతున్న సమయంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ కు సంబంధించిన సరికొత్త ఈ-మెయిళ్లపై ఎఫ్ బీఐ విచారణ చేపట్టడంతో ఆమె అమెరికన్ల విశ్వాసాన్ని క్రమంగా కోల్పోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఎన్నికల సమీకరణాలు మారిపోయాయి. కొద్ది రోజుల క్రితం తాను ఎన్నికల్లో గెలవనని భావించిన ట్రంప్ తిరిగి తనదైన శైలిలో ప్రత్యర్ధిపై విరుచుపడుతున్నారు. అంతేకాదు తాజాగా ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోల్ లు నిర్వహించిన సర్వేలో ట్రంప్, హిల్లరీని సమం చేశారు.
ఈ విషయాన్ని బుధవారం ఫ్లోరిడా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రస్తావించారు. హిల్లరీని సమం చేయడాన్ని తానే నమ్మలేకపోతున్నానని అన్నారు. రెండు వారాల క్రితం ట్రంప్ కంటే 12 పాయింట్లు ఉన్న హిల్లరీ ఆధిక్యం.. ఎఫ్ బీఐ ప్రకటన తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. ఇరు అభ్యర్ధులకు సొంత పార్టీల మద్దతు పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది. సొంత పార్టీలకు చెందిన వారిలో 85శాతం మంది అధ్యక్ష పదవి అభ్యర్ధులకు మద్దతు ఇస్తున్నట్లు సర్వే పేర్కొంది. స్వతంత్ర అభ్యర్ధుల నుంచి కూడా ఇరువురు అభ్యర్ధులకు 85 శాతం మద్దతు ఉందని చెప్పింది.
జార్జియా, టెక్సాస్, అరిజోనా, ఉతాహ్ రాష్ట్రాల్లో హిల్లరీ ప్రతిష్ట మసకబారుతున్నట్లు తెలిపింది. హిల్లరీకి పట్టుకలిగిన మిచిగాన్, విస్కొన్సిన్ లలో ట్రంప్ డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఏదైనా ఒకదానిలో ట్రంప్ విజయం సాధిస్తే ఒహియో, ఫ్లోరిడా, నార్త్ కరోలినాల్లో పరాజయం ఎదురైనా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆశలు సజీవంగా నిలుపుకోవచ్చు.
fivethirtyeight.com ఇచ్చిన వివరాల ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఒక అభ్యర్ధి మూడు నుంచి ఐదు శాతం ఓట్లు సాధిస్తే.. అతని లేదా ఆమె ప్రత్యర్ధి అధ్యక్షపదవికి ఎలక్టోరల్ కాలేజ్ లో అవసరమయ్యే 270 సీట్లను సాధించలేరు. అదే ఇరు అభర్ధుల మధ్య ఓట్ల శాతం మరింత తగ్గితే ప్రత్యర్ధి విజయాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ట్రంప్, హిల్లరీని అడ్డుకోవచ్చు. ఇదే సమయంలో హిల్లరీ విజయం సాధించాలంటే కచ్చితంగా ట్రంప్ ను అడ్డుకుని తీరాలి. అంటే మరో మహిళ ట్రంప్ పై ఆరోపణలు చేయాలి.