ఐటీసీ అప్, ఆర్‌ఐఎల్ డౌన్ | Sakshi
Sakshi News home page

ఐటీసీ అప్, ఆర్‌ఐఎల్ డౌన్

Published Tue, Jan 21 2014 3:45 AM

ఐటీసీ అప్, ఆర్‌ఐఎల్ డౌన్

అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించిన ఐటీ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 141 పాయింట్లు ర్యాలీ జరిపి 21,205 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్ల పెరుగుదలతో తిరిగి 6,300 స్థాయిపైన క్లోజయ్యింది. లాభాల స్వీకరణతో క్రితం ట్రేడింగ్ రోజున 5 శాతంపైగా నష్టపోయిన ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు తాజాగా తిరిగి అంతేశాతం ర్యాలీ జరపడంతో సూచీల పెరుగుదల సాధ్యపడింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత 27 శాతం నికరలాభం పెరుగుదలను ప్రకటించిన మరో ఐటీ దిగ్గజం విప్రో దాదాపు 4 శాతం పెరిగి 14 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 573 వద్ద క్లోజయ్యింది. ఇదేబాటలో హెచ్‌సీఎల్ టెక్ 3.5 శాతం ర్యాలీ జరిపి ఆల్‌టైమ్ గరిష్టస్థాయి రూ. 1,430 వద్ద ముగిసింది. గతవారం ట్రేడింగ్ ముగింపురోజున మార్కెట్ అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించిన ఎఫ్‌ఎంసీజీ షేరు ఐటీసీ ర్యాలీ జరపగా, ముకేశ్ అంబానీ గ్రూప్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ క్షీణించింది. ఐటీసీ 1.5% ఎగిసి రెండునెలల గరిష్టస్థాయి వద్ద క్లోజ్‌కాగా, రిలయన్స్ వారం రోజుల కనిష్టస్థాయికి దిగింది. కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ మిడ్‌క్యాప్ షేర్లు జోరందుకున్నాయి. అరబిందో ఫార్మా, ఆర్‌కామ్, ఓల్టాస్, పీటీసీ, హెక్సావేర్, హవెల్స్, ఫెడరల్ బ్యాంక్, హిందుస్థాన్ జింక్, ఫ్యూచర్ రిటైల్ షేర్లు 4-7% మధ్య పరుగులు తీసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 385 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ సంస్థలు రూ. 310 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.
 
 టీసీఎస్ కౌంటర్లో యాక్టివిటీ....
 నగదు విభాగంలో 5.5 శాతం ర్యాలీ జరిపిన టీసీఎస్ ఫ్యూచర్ కాంట్రాక్టులు, ఆప్షన్లలో చురుగ్గా ట్రేడింగ్ యాక్టివిటీ జరిగింది.  షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ టీసీఎస్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 2.85 లక్షల షేర్లు కట్‌కావడంతో మొత్తం ఓఐ 37.88 లక్షల షేర్లకు దిగింది. శుక్రవారం ఈ షేరు క్షీణించిన సందర్భంగా రూ. 2,300 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున రైట్ చేసిన కాల్ ఆప్షన్లను సోమవారం అంతేవేగంతో ఇన్వెస్టర్లు అన్‌వైండ్ చేయడంతో ఈ కాల్ ఆప్షన్ నుంచి 3.38 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 2,350, 2,400 స్ట్రయిక్స్ వద్ద కూడా కాల్ కవరింగ్ జరినప్పటికీ, 2,400 కాల్ ఆప్షన్లో ఇంకా 6.75 లక్షల షేర్ల బిల్డప్ వుంది. రూ. 2,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ ఫలితంగా ఈ పుట్ ఆప్షన్లో 1.85 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 3.73 లక్షల షేర్ల పుట్ బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 2,300 స్థాయిపైన స్థిరపడితే 2,400 స్థాయిని తాకవచ్చని, ఆ స్థాయిని కూడా భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే మరో రౌండు షార్ట్ కవరింగ్ జరగవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది. అయితే 2,300 స్థాయిని కోల్పోతే క్రమేపీ బలహీనపడవచ్చని ఈ స్ట్రయిక్ వద్ద ఏర్పడిన పుట్ బిల్డప్ విశ్లేషిస్తున్నది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement