ముంబై: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం, సిగరెట్ ఉత్పత్తి మేజర్ ఐటీసీ అమెరికాలోని తన సబ్సిడరీ సంస్థ 'కింగ్ మేకర్ మార్కెటింగ్' లో పూర్తి వాటాను విక్రయించాలని భావిస్తోంది. అమెరికా మార్కెట్ లో ఐటీసీ సిగరెట్ ఉత్పత్తులను విక్రయించే ఈ కంపెనీలోని వాటా విక్రయానికి (24 మిలియన్ డాలర్లు) రూ.160 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఈ ప్రతిపాదనకు కార్పొరేట్ నిర్వహణ కమిటీ ఆమోదం లభించిందనీ బీఎస్ఈ ఫైలింగ్ లో ఐటీసీ తెలిపింది. అక్టోబర్ 8, 2016 న ఈ ఒప్పందం నమోదు చేయబడిందనీ, ఈ డీల్ ముగిసిన అనంతరం అమెరికా లోని కింగ్ మేకర్ మార్కెటింగ్ సంస్థతో తమ సబ్సిడరీ ముగుస్తుందని స్పష్టం చేసింది.
కాగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం కేంద్రంగా కింగ్ మేకర్ మార్కెటింగ్ సేవలు అందిస్తోంది. కింగ్ మేకర్ మార్కెటింగ్ లో ఏస్, చెకర్స్ , హెచ్ఐ వాల్, గోల్డ్ క్రెస్ట్ బ్రాండ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ వార్తలతో ఐటీసీ షేర్ 1,85 శాతం లాభపడి రూ 240.85 వద్ద ట్రేడవుతోంది.