ఇది చాలా విచిత్రమైన రాష్ట్ర విభజన:శరద్ యాదవ్
న్యూఢిల్లీ: లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరును జేడీయూ నేత శరద్ యాదవ్ తప్పుబట్టారు. విభజనపై అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వస్తుందనుకుంటే..గందరగోళ పరిస్థితులే అక్కడ చోటు చేసుకున్నాయని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు ఆమోదం అనేది చాలా విచిత్రంగా జరిగిపోయిందన్నారు. సభలో అభిప్రాయాలు చెప్పాలనుకున్న సమయంలో ఏం జరిగిందో అర్ధం కాలేదన్నారు. ఇది చాలా విచిత్రమైన రాష్ట్ర విభజనగా ఆయన అభివర్ణించారు. సభలో అందరూ నిలబడి అరుస్తూనే ఉండటంతో తమ అభిప్రాయాలు చెప్పే అవకాశమే లేకుండా పోయిందన్నారు.
ఆ రకంగా సభ్యులు అరవడాన్ని భరించలేకపోయామని శరద్ యాదవ్ తెలిపారు. అందుకే అక్కడ ఉండలేక వాకౌట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి విభజనకు తాము సాక్షులుగా ఉండలేకే సభ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.