పది సెకన్లలో మొత్తం తతంగం ముగించేశారు: వైఎస్ జగన్
జేడీయూ నేత శరద్ యాదవ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సాయం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. తమ ఫ్రంటులోని 11 పార్టీలతో కలిసి చర్చిస్తామని, ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని చెబుతామని ఈ సందర్భంగా శరద్ యాదవ్ తెలిపారు. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసినా, కేంద్రం మాత్రం అలాగే మొండిగా ముందుకు వెళ్తోందని, సమాఖ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని కాదని అడుగులు వేస్తోందని విమర్శించారు. ఈ అంశాలపైనే తాము శరద్ యాదవ్తో మాట్లాడామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ ఫ్రంటులోని 11 పార్టీలతో కలిసి మాట్లాడుతానన్నారని చెప్పారు. విపక్షాలన్నీ ఇప్పటికైనా ఒక్కతాటి మీదకు రావాలని, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని కోరారు. సభలో కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
సభలో ఎక్కువమంది చేతులెత్తితేనే దాన్ని మూజువాణీ ఓటుగా భావించి, బిల్లు ప్రవేశపెట్టడానికి ఆమోదంగా పరిగణించాలని, కానీ స్పీకర్ మీరాకుమార్ మాత్రం అలా ఎవరినీ ఏమీ అడగకుండా పది సెకన్లలో మొత్తం తతంగం ముగించారని గుర్తు చేశారు. నిండు సభలో అసలు ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందని, ఈ వ్యవహారాన్ని ఎస్పీ, అన్నాడీఎంకే, జేడీయూ సహా అందరూ వ్యతిరకించారని జగన్ చెప్పారు. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు. తమను సభలో ప్రవేశించకుండా ఐదు రోజులు సస్పెండ్ చేశారని, సీమాఃధ్ర ఎంపీలెవ్వరూ సభలో లేకుండా చేసి రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ఎంపీలెవ్వరూ చర్చలో పాల్గొనకుండా చేయాలన్నది వారి ఉద్దేశమని, ఇలాంటి అన్యాయం ఎక్కడా ఎప్పుడూ జరిగి ఉండదని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.