
భూ దోపిడీకి చట్టబద్ధతా? ఒప్పుకోం: కోదండరామ్
ప్రాజెక్టుల నిర్మాణాల కోసమంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణ బిల్లుతో దోపిడీకి చట్టబద్ధత లభించినట్లవుతుందని జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు.
హైదరాబాద్: ప్రాజెక్టుల నిర్మాణాల కోసమంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్ట సవరణ బిల్లుతో దోపిడీకి చట్టబద్ధత కల్పించినట్లవుతుందని జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కొత్తగా ఆమోదం పొందిన బిల్లుతో నిర్వాసితులకు అన్యాయమేతప్ప న్యాయం దక్కదని పునరుద్ఘాటించారు. భూసేకరణ చట్టం-2013కు ప్రత్యామ్నయంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన సవరణ చట్టాన్ని నిరసిస్తూ, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోదండరామ్ హైదరాబాద్‌లోని తన ఇంట్లో మౌనదీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్షను విరమిస్తూ ఆయన ప్రజలకు ఉద్దేశించి మాట్లాడారు.
'ప్రభుత్వాధినేత, మంత్రులు, అధికారులు చెబుతున్నట్లు భూసేకరణ చట్టం-2013 లోపభూయీష్టమేమీకాదు. గడిచిన ఏళ్లలో ఎంతోమంది నిర్వాసితులకు ఆ చట్టం ద్వారా న్యాయం లభించింది. అయితే ఆ చట్టాన్ని కాదని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన సవరణ చట్టం దోపిడీని చట్టబద్ధం చేసినట్లుంది. నష్టపరిహారం భారీగా ఇస్తున్నామంటున్న ప్రభుత్వం డబ్బుల లెక్క చెప్పుకుంటోంది. కానీ ప్రజలు మాత్రం బతుకుదెరుకు గురించి బాధపడుతున్నరు. మిమ్మల్ని కిందపడేసి తొక్కేసైనా భూములు లాక్కుంటామన్న మంత్రుల మాటలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. దీంతో ప్రజలు దిక్కుతోచని స్థితికి లోనయ్యారు. వారికి అండగా ఉండేందుకే జేఏసీ ముందుకొచ్చింది. ఇందులో ప్రజల మేలే తప్ప రాజకీయాలు లేవు' అని కోదండరామ్ అన్నారు. (వారిది రాక్షసానందం: సీఎం కేసీఆర్)
బాధితుల గొంతుక వినిపించాలనే దీక్ష
మల్లన్న సాగర్ సహా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టుల కింద నిర్వాసితులవుతోన్న ప్రజల గోస వర్ణనాతీతమని, రాజధాని హైదరాబాద్‌లో వారి గొంతుకను వినిపించడానికే జేఏసీ ధర్నా కార్యక్రమం నిర్వహించాలనుకుందని కోదండరామ్ అన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తమపై అణిచివేతను ప్రయోగించిదని వాపోయారు. 'మేమేమన్నా సీట్లు లాక్కుంటమా, పదవులు లాక్కుంటమా? నిర్వాసితులకు ఇబ్బందులున్నాయి.. మాట్లాడదామంటే ప్రభుత్వం ఎందుకు ముందుకురాదు? కనీసం ప్రజల వాణి వినరా? ఏకపక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు? ధర్నాకు అనుమతి ఇవ్వకపోతే పోయిరి, ఇళ్లల్లోనే ఉన్న జేఏసీ ప్రతినిధులను అరెస్ట్ చేయడం సరైందేనా?'అని ప్రశ్నించారు. తనపై తనకు నమ్మకంలేని సందర్భంలోనే ప్రభుత్వం నిర్బంధానికి దిగుతుందన్న గొప్పవాళ్ల రాతను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తోందని అన్నారు.